70 కిలోల గంజాయి పట్టివేత.. ఐదుగురు అరెస్టు

ప్రజాశక్తి-విజయనగరంకోట : విజయనగరం జిల్లా ఎస్‌.కోట పోలీసు స్టేషను పరిధిలోని బొడ్డవర చెక్‌ పోస్టు వద్ద అక్రమంగా తరలిస్తున్న 70.100 కిలోల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. ఐదుగురు నిందితులను అరెస్టు చేశారు. వారు వినియోగించిన కారును స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు వివరాలను ఎస్‌పి వకుల్‌ జిందాల్‌ బుధవారం మీడియాకు వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. అక్రమంగా గంజాయిని తరలిస్తున్నట్లు పక్కా సమాచారం అందడంతో పోలీసులు బొడ్డవర చెక్‌ పోస్టు వద్ద వాహన తనిఖీలు చేపట్టారు. అరకు వైపు నుండి వస్తున్న టాటా ఇండిగో కారును తనిఖీ చేయగా కారు డిక్కీలో 56 గంజాయి ప్యాకెట్లు (70.1కిలోలు) ఉన్నట్లు గుర్తించారు. రెవెన్యూ అధికారుల సమక్షంలో గంజాయిని సీజ్‌ చేసి, కారులో ఉన్న ఐదుగురు వ్యక్తులు అదుపులోకి తీసుకున్నారు. వారిలో ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం ఉజ్జయిని ప్రాంతానికి చెందిన షా ఆలం, బెంగుళూరు ప్రాంతానికి చెందిన షేక్‌ అజాజ్‌, ఒడిశా రాష్ట్రం మల్కనగిరికి చెందిన రంజిత్‌ బిస్వాస్‌, నిఖిల్‌ తపాలి, బిశ్వజిత్‌ మహల్దార్‌ ఉన్నారు. నిందితుల నుంచి నాలుగు మొబైల్‌ ఫోన్‌లు, రూ.20,300 నగదు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్‌పి తెలిపారు.

➡️