ఎంఇవో కార్యాలయాల్లో దరఖాస్తుల స్వీకరణ
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయా(కెజిబివి)ల్లో ఖాళీగా ఉన్న 729 బోధనేతర (నాన్‌టీచింగ్) సిబ్బంది పోస్టులను పొరుగు సేవల (ఔట్‌సోర్సింగ్) ప్రాతిపదికన భర్తీ చేసేందుకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు సమగ్ర శిక్ష డైరెక్టర్ బి.శ్రీనివాసరావు వెల్లడించారు. 2024-25 విద్యాసంవత్సర కాలానికి అర్హులైన మహిళా అభ్యర్థుల నుంచి ఈ నెల 7వ తేదీ నుంచి దరఖాస్తులు స్వీకరిస్తామని శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తిగల అభ్యర్థులు ఈ నెల 15వ తేదీలోపు ఎంఇవో కార్యాలయంలో దరఖాస్తులు ఆఫ్‌లైన్‌లో అందించాలని పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న టైప్-3 కెజిబివిల్లో 547 పోస్టుల్లో హెడ్‌కుక్ 48, అసిస్టెంట్ కుక్ 263, వాచ్ ఉమెన్ 95, స్కావెంజర్ 79, స్వీపర్ 62 ఖాళీలు ఉన్నాయని తెలిపారు. టైప్-4 కెజిబివిల్లో 182 పోస్టులకుగాను హెడ్ కుక్ 48, అసిస్టెంట్ కుక్ 76, చౌకీదార్ 58 ఉన్నాయని వివరించారు. ఈ నెల 7వ తేదీన జిల్లా, మండల స్థాయిల్లో పేపర్ నోటిఫికేషన్ విడుదలవుతుందని తెలిపారు. మండల, జిల్లా స్థాయిల్లో వచ్చిన దరఖాస్తులు 21వ తేదీన జిల్లాస్థాయి ఎంపిక కమిటీకి వస్తాయని పేర్కొన్నారు. వీటిని అప్కాస్ ఛైర్మన్‌కు 22వ తేదీన పంపుతారని వెల్లడించారు.
