తెలంగాణకు 8.5, ఆంధ్రప్రదేశ్‌కు 5.5 టిఎంసిలు

Apr 13,2024 07:53 #hydrabad, #KRMB, #meating

– నాగార్జున సాగర్‌ నుంచి నీటి కేటాయింపులు
– కెఆర్‌ఎంబి త్రిసభ్య కమిటీ నిర్ణయం
ప్రజాశక్తి – హైదరాబాద్‌ బ్యూరో :
తాగునీటి అవసరాల కోసం నాగార్జున సాగర్‌లో అందుబాటులో ఉన్న జలాలను తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలకు కృష్ణా బోర్డు పంపకాలు చేసింది. నాగార్జున సాగర్‌ జలాశయంలో 500 అడుగులపైన ఉన్న 14 టిఎంసిలలో తెలంగాణకు 8.5, ఆంధ్రప్రదేశ్‌కు 5.5 టిఎంసిల నీటిని కృష్ణానదీ యాజమాన్య బోర్డు త్రిసభ్య కమిటీ కేటాయించింది. కెఆర్‌ఎంబి సభ్య కార్యదర్శి డిఎం రాయిపురే నేతృత్వంలో శుక్రవారం హైదరాబాద్‌ జలసౌధలో త్రిసభ్య కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో తెలంగాణ ఇఎన్‌సి అనిల్‌ కుమార్‌, ఎపి ఇఎన్‌సి నారాయణరెడ్డి, పలువురు ఇంజనీర్లు పాల్గన్నారు. తెలుగు రాష్ట్రాల్లో తాగునీటి సమస్య, కృష్ణా జలాల కేటాయింపులు, గత సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు, ప్రస్తుత అవసరాలపై ఈ సమావేశంలో చర్చ జరిగింది. గతంలో ఆంధ్రప్రదేశ్‌కు 45, తెలంగాణకు 35 టిఎంసిలు కేటాయించగా.. అందులో తమకు మరో ఐదు టిఎంసిల మిగులు ఉందని, తెలంగాణ అదనంగా ఏడు టిఎంసిలు వినియోగించుకుందని ఆంధ్రప్రదేశ్‌ ఇఎన్‌సి నారాయణ రెడ్డి పేర్కొన్నారు. సాగర్‌ నుంచి వెంటనే తమకు ఐదు టిఎంసిల నీరు ఇవ్వాలని ఆయన డిమాండ్‌ చేశారు. కృష్ణా జలాల్లో ఆంధ్రప్రదేశ్‌ ఎక్కువ మొత్తాన్నే వినియోగించుకుందని, అంతా లెక్కలోకి రాలేదని తెలంగాణ ఇఎన్‌సి అనిల్‌ పేర్కొన్నారు. శ్రీశైలం నుంచి ఎలాంటి అవసరాలకైనా ఆంధ్రప్రదేశ్‌ నీరు తీసుకోకుండా చూడాలని ఆయన కోరారు. హైదరాబాద్‌తో పాటు నల్గండ, సూర్యాపేట, మహబూబాబాద్‌, ఖమ్మం జిల్లాల పరిధిలో ఎక్కువ శాతం ప్రజలు తాగునీటి కోసం సాగర్‌పై ఆధారపడ్డారనివివరించారు. హైదరాబాద్‌ జనాభాను పరిగణనలోకి తీసుకొని తాగునీటి కోసం ఎక్కువ మొత్తం కేటాయించాలని కోరారు. దీంతో నాగార్జునసాగర్‌లో 500 అడుగులపైన ఉన్న 14 టిఎంసిల నీటిని రెండు రాష్ట్రాలకు కేటాయిస్తూ త్రిసభ్య కమిటీ నిర్ణయం ప్రకటించింది. మే మాసంలో మరోమారు సమావేశమై తాజా పరిస్థితిని సమీక్షించి అవసరమైన చర్యలు తీసుకుంటామని కెఆర్‌ఎంబి సభ్య కార్యదర్శి డిఎం రాయిపురే తెలిపారు.

➡️