83 కిలోల గంజాయి స్వాధీనం.. ముగ్గురు నిందితుల అరెస్టు

ప్రజాశక్తి – పలాస : అక్రమ రవాణా చేస్తున్న గంజాయిని స్వాధీనం చేసుకుని ముగ్గురు నిందితులను అరెస్టు చేసినట్లు శ్రీకాకుళం ఎస్‌పి కె.వి మహేశ్వరరెడ్డి తెలిపారు. ఇందుకు సంబంధించిన వివరాలను కాశీబుగ్గ పోలీస్‌స్టేషన్‌లో బుధవారం విలేకరుల సమావేశంలో ఆయన వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం..ఒడిశా రాష్ట్రం గంజాం జిల్లాకు చెందిన బబ్రు బహన్‌స్వైన్‌, మధ్యప్రదేశ్‌ రాష్ట్రం నాసిక్‌ జిల్లాకు చెందిన లలిత్‌ ప్రదీప్‌ బైనర్‌.. బరంపురం నుంచి ఇచ్ఛాపురానికి వచ్చారు. తిరిగి ఇచ్ఛాపురం రైల్వేస్టేషన్‌కు వెళ్లేందుకు ఆటో కోసం చూస్తుండగా, పోలీసులు అనుమానించి వారి బ్యాగులను తనిఖీ చేశారు. అందులో ఉన్న 82.200 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అలాగే ద్విచక్ర వాహనంపై 1.33 కేజీల గంజాయిని హైదరాబాద్‌కు తరలిస్తున్న ఒడిశా రాష్ట్రం కేంద్రపర జిల్లా రాజానగరానికి చెందిన త్రిలోచన్‌ సుమంతరారుని పలాస మండలం మొగిలిపాడు కూడలి వద్ద పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పై రెండు సంఘటనల్లో ముగ్గురిని అరెస్టు చేశారు. గంజాయి అక్రమ రవాణాపై 20 రోజుల్లో 312 కేసులు నమోదు చేసి, 31 మందిని అరెస్టు చేశామని, 230 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని ఎస్‌పి తెలిపారు.

➡️