ఆహార భద్రత కోసం రూ.88కోట్ల ఎంఓయూ

  • వైద్యారోగ్యశాఖ మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : ప్రజలకు పటిష్టమైన ఆహార భద్రత కల్పించడంతో పాటు ఆహార భద్రతా ప్రమాణాలని మరింత పెంపొందించడానికి భారత ఆహార భద్రతా ప్రమాణాల సంస్థ (పుడ్‌ సేప్టీ, స్టాండర్డ్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా)తో రాష్ట్ర ప్రభుత్వం రూ.88.41కోట్ల అంచనా వ్యయంతో ఎంఓయూ కుదుర్చుకున్నట్లు రాష్ట్ర వైద్యారోగ్యశాఖమంత్రి సత్యకుమార్‌ యాదవ్‌ వెల్లడించారు. ఎంఓయూలపై సంతకాలు చేసిన వారిలో ఎఫ్‌ఎస్‌ఎస్‌ఎఐ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ జి.కమలవర్ధనరావు, ఎపి పుడ్‌ సేప్టీ కమిషనరు సి.హరికిరన్‌, ఎఫ్‌ఎస్‌ఎస్‌ ఎఐ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ ఇనోషి శర్మ ఉన్నారు. వైద్యారోగ్యశాఖ మంత్రి సత్యకుమార్‌ మంగళవారం మాట్లాడుతూ ఈ విషయం తెలిపారు. ల్యాబ్‌లను నెలకొల్పేందుకు ఎఫ్‌ఎస్‌ఎస్‌ ఎఐ అంగీకరించిందని తెలిపారు. ఈ ప్రయోగశాలల్లో శాంపిళ్ల పరీక్షలకు అవసరమైన ప్రాధమిక వసతులను ఏర్పాటు చేసేందుకు రూ.6.5 కోట్లు, అత్యాధునిక పరికరాల ఏర్పాటు ఏర్పాటుకు రూ.8.46 కోట్లు, మైక్రో బయాలజీకల్‌ లేబరేటరీ ఏర్పాటుకు రూ.4.28 కోట్లను కేటాయించినట్లు చెప్పారు. దీంతో పాటు మరో 13కోట్ల అంచనా వ్యయంతో ఏలూరు, ఒంగోలుల్లో ప్రాధమిక ఆహార ప్రయోగ పరీక్షల ప్రయోగశాలలు (బేసిక్‌ పుడ్‌ టెస్టింగ్‌ లేబరేటరీస్‌) ఒక్కొక్కటి రూ.6.5 కోట్లతో నెలకొల్పనున్నారు. రాష్ట్రంలో ఆహార శాంపిళ్ల సేకరణ, విశ్లేషణ (కలెక్షన్‌ అండ్‌ అనాలిసిస్‌) కోసం రూ.12కోట్లు, ఆహార భద్రతా ప్రమాణాలపై విస్తృత అవగాహన కల్పించేందుకు రూ.11 కోట్లు కేటాయించేందుకు అవగాహన కుదిరిందిదన్నారు.

➡️