- స్త్రీ, శిశు సంక్షేమ శాఖమంత్రి సంధ్యారాణి
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రంలో కొత్తగా 950 అంగన్‌వాడీ కేంద్రాలను త్వరలో ప్రారంభించనున్నట్లు స్త్రీ, శిశు సంక్షేమశాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి చెప్పారు. శాసనసభలో స్త్రీ,శిశు సంక్షేమ శాఖ గ్రాంట్లపై సోమవారం ఆమె వివరణ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సుమారు 2వేల అంగన్‌వాడీ కేంద్రాల నిర్మాణం మధ్యలోనే నిలిచిపోయాయని, గత ప్రభుత్వం ఒక్క దానిని కూడా పూర్తిచేయలేదన్నారు. తమ ప్రభుత్వం వీటిని పూర్తిచేసేందుకు నిధులు కేటాయించిందని, 950 కేంద్రాలను 2-3 నెలల్లోనే ప్రారంభిస్తామన్నారు. అంగన్‌వాడీలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి తమ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని చెప్పారు.
జివో 3కి సమానంగా మరో జివో
గిరిజనుల ప్రాంతంలో గిరిజనులకే ఉద్యోగాలు కల్పించే జివో 3కు సమానమైన జివోను మరోకటి తీసుకొస్తామని మంత్రి సంధ్యారాణి చెప్పారు. ఎన్టీఆర్ హయాంలో తీసుకొచ్చిన జివో 3ను సుప్రీంకోర్టు కొట్టేసిందని తెలిపారు.ఆ సమయంలో అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి కనీసం రివ్యూ పిటిషన్ కూడా వేయలేదన్నారు.గిరిజనులకు అమలయ్యే 18 రకాల పథకాలను గత ప్రభుత్వం రద్దు చేసిందని, వీటిని మరలా ప్రారంభిస్తామన్నారు.