ప్రజాశక్తి-నెల్లూరు : నెల్లూరులో ఓ రౌడీషీటర్ దారుణ హత్యకు గురయ్యారు. ఈ సంఘటన బాలాజీనగర్ పోలీసు స్టేషన్ పరిధిలోని రామలింగాపురం రైల్వే అండర్ బ్రిడ్జి వద్ద సోమవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జనశక్తినగర్ ప్రాంతానికి చెందిన గుంజి రవి (40) తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో నివాసం ఉంటున్నాడు. ఓ హత్య కేసులో జైలుకెళ్లి ఇటీవలే విడుదలయ్యారు. నెల్లూరుకు వచ్చిన రవిని పాతకక్షల నేపథ్యంలో నగరానికి చెందిన చింటూ, సాయి, వెంకటరమణ మరి కొందరు కత్తులతో పొడిచి హతమార్చారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.
