హైదరాబాద్: న్యూస్ కవర్ చేసేందుకు వెళ్లిన మీడియా ప్రతినిధులపై సినీనటుడు మోహన్ బాబు దాడి నేపథ్యంలో ఆయనపై కేసు నమోదైంది. పహాడీ షరీఫ్ పోలీసులు బీఎన్‌ఎస్ 118 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. ఈరోజు ఉదయం 10:30గంటలకు విచారణకు హాజరు కావాలని పోలీసులు తెలిపారు. అయితే దాడి అనంతరం బిపి పెరగడంతో మోహన్ బాబు అస్వస్థతకు గురైయ్యారని కుటుంబ సభ్యులు తెలిపారు. కుటుంబ వివాదం నేపథ్యంలో మంగళవారం జల్‌పల్లిలోని మోహన్‌బాబు నివాసానికి మీడియా ప్రతినిధులు వెళ్లారు. ఈ క్రమంలో మోహన్‌బాబుతో పాటు వచ్చిన బౌన్సర్లు, సహాయకులు.. గేటు లోపల ఉన్న మీడియా ప్రతినిధులను బయటకు తోసేయడంతో పాటు కర్రలతో దాడిచేశారు. ఈ దాడిని జర్నలిస్ట్ సంఘాలు ఖండిస్తున్నాయి. ఈ క్రమంలో జర్నలిస్టుపై దాడిని నిరసిస్తూ.. బుధవారం ఉదయం 11 గంటలకు ఫిల్మ్ నగర్ ఫిల్మ్ ఛాంబర్ వద్ద శాంతియుత నిరసనకు జర్నలిస్టులు పిలుపునిచ్చారు. ఈ దాడిని పలువురు ప్రముఖులు ఖండించారు. తెలంగాణ ప్రెస్ అకాడమీ మాజీ చైర్మన్ అల్లం నారాయణ జర్నలిస్టులపై దురుసుగా ప్రవర్తించిన మోహన్‌బాబుపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలన్నారు. మోహన్‌బాబుపై చర్యలు తీసుకోకుంటే ఉద్యమం తప్పదన్నారు. రిపోర్టర్‌పై మోహన్‌బాబు దౌర్జన్యం చేయడం దారుణమని ప్రముఖ విశ్లేషకులు తెలకపల్లి రవి తెలిపారు.