ఎపిపిఎస్‌సి ఛైర్మన్‌ను నియమించాలి

  • పెండింగ్‌ నియామకాలు చేపట్టాలి : డివైఎఫ్‌ఐ

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (ఎపిపిఎస్‌సి)కు ఛైర్మన్‌ను వెంటనే నియమించాలని డివైఎఫ్‌ఐ రాష్ట్ర కమిటీ డిమాండ్‌ చేసింది. పెండింగ్‌లో ఉన్న నియామకాలు చేపట్టాలని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు వై రాము, జి రామన్న ఆదివారం ఒక ప్రకటనలో కోరారు. ఎపిపిఎస్‌సి ఛైర్మన్‌ రాజీనామా చేసి మూడు నెలలు పూర్తయిందని తెలిపారు. గవర్నరు, రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని ఛైర్మన్‌ను నియమించడం గానీ, ఎపిపిఎస్‌సి సభ్యులలో సీనియర్‌కు ఆ బాధ్యత అప్పగించి పెండింగ్‌లో ఉన్న నోటిఫికేషన్లు పూర్తిచేయాలని సూచించారు. ఇప్పటికే గ్రూప్‌-1లో 89, గ్రూప్‌-2లో 897, డివైయివో 38 పోస్టులకు ప్రిలిమ్స్‌ పరీక్షలు రాసి 1.14 లక్షల మంది అభ్యర్థులు మెయిన్స్‌ పరీక్షల కోసం ఎదురుచూస్తున్నారని తెలిపారు. ఛైర్మన్‌ను నియమించి మెయిన్స్‌ పరీక్ష షెడ్యూల్‌ విడుదల చేయాలని కోరారు.
290 డిగ్రీ లెక్చరర్‌, 47 జూనియర్‌ లెక్చరర్‌, 99 పాలిటెక్నిక్‌, టిటిడిలో 49 డిగ్రీ లెక్చరర్‌ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్‌ విడుదల చేశారని తెలిపారు. ప్రతి అభ్యర్థి రూ.250 ఫీజు కూడా చెల్లించారని పేర్కొన్నారు. వీటితో పాటు మరో 16 నోటిఫికేషన్లకు ఆర్థికశాఖ అనుమతి ఇచ్చిందని తెలిపారు. ఎపిపిఎస్‌సి ఏ పరీక్ష ఎప్పుడు నిర్వహిస్తుందో తెలియక అభ్యర్థులు అయోమయంలో ఉన్నారని పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం లాగా జాబ్‌ క్యాలెండర్‌ ప్రకటించి నెలలు వారీగా పరీక్షలు నిర్వహించాలని డిమాండ్‌ చేశారు. నోటిఫికేషన్‌ ఇచ్చే ముందే జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రతిసారీ కోర్టును ఆశ్రయించే పరిస్థితి నుంచి దూరం చేసేలా నిజాయతీతో ప్రభుత్వం నోటిఫికేషన్లు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.

➡️