- అఖిలపక్ష ఆధ్వర్యంలో పోరాడుతాం : సోమిరెడ్డి
ప్రజాశక్తి-నెల్లూరు ప్రతినిధి : కృష్ణపట్నం పోర్టులో కంటైనర్ టెర్మినల్‌ను తిరిగి ప్రారంభించాలని పోర్టు సిఇఒను ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం అఖిలపక్ష పార్టీల నేతలతో కలిసి సిఇఒ జగదీష్ పటేల్‌ను ఆయన కలిశారు. అనంతరం మీడియాతో సోమిరెడ్డి మాట్లాడుతూ.. ప్రపంచంలోనే అత్యంత ధనికులైన అదాని… కంటైనర్ టెర్మినల్‌ను నడపలేరా? అని ప్రశ్నించారు. పది వేల మంది కార్మికుల ఉద్యోగాలు పోయాయని, వేలాది ఎకరాల భూమిని పోర్టు కోసం ప్రజలు ఇచ్చారని, ఇప్పుడు కంటైనర్ పోర్టును చెన్నైకి తీసుకువెళితే చూస్తు ఊరుకోబోమన్నారు. తాము కేవలం రైతులు, కార్మికులు, స్థానికులు ప్రయోజనాల కోసమే పోరాటం చేస్తున్నామన్నారు. ఇరవై రోజుల్లో ఒక ప్రకటన చేస్తామని చెప్పారని, లేదంటే ఉద్యమం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. సిపిఎం జిల్లా కార్యదిర్శవర్గ సభ్యులు ఎం. మోహన్‌రావు మాట్లాడుతూ.. ప్రజలు పండించిన అనేక పంటలు పోర్టు నుంచి ఎగుమతి అయ్యాయన్నారు. కంటైనర్ పోర్టు వెళ్లిపోవడంతో ఆరు వందల ఏజెన్సీలు మూతపడ్డాయని, పది వేల మందికి ఉద్యోగం, ఉపాధి పోయిందన్నారు. సిఇఒను కలిసిన వారిలో టిడిపి జిల్లా ప్రధాన కార్యదర్శి చేజర్ల వెంకటేశ్వర్లురెడ్డి, సిఐటియు నాయకులు గోగుల శ్రీనివాసులు, సిపిఐ నాయకులు శంకర్ కిషోర్, బిజెపి నాయకులు కె. ఆంజనేయరెడ్డి, రవీంద్రరెడ్డి తదితరులున్నారు.