- జెవివి రాష్ట్ర అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్సీ గేయానంద్
ప్రజాశక్తి – ఎడ్యుకేషన్ (విజయవాడ అర్బన్) : మన దేశాన్ని మరింత ఆధునిక దేశంగా మార్చేందుకు రాజ్యాంగాన్ని మరింత పరిపుష్టం చేసేలా చర్చ జరగాలని జనవిజ్ఞాన వేదిక రాష్ట్ర అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్సీ డాక్టర్ ఎం.గేయానంద్ అన్నారు. విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరుగుతున్న 35వ పుస్తక మహోత్సవంలో శనివారం రామోజీరావు సాహిత్యవేదికపై రెండో కార్యక్రమంగా ఎమ్మెల్సీ కెఎస్.లక్ష్మణరావు రచించిన ‘భారత రాజ్యాంగం’ పుస్తకాన్ని, రాం ప్రదీప్ రాసిన ‘విస్మత మహనీయులు’ పుస్తకాన్ని గేయానంద్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో అన్ని గొంతుకలూ వినబడాలని, అందరి అభిప్రాయాలు వెల్లడిం చేందుకు, చర్చలు జరిగేందుకు తగిన వాతావరణాన్ని నెలకొల్పాలని ఆకాంక్షించారు. రాజ్యాంగం ప్రజలకే సర్వాధి కారాలు ఇచ్చిందని, వారి హక్కులు, బాధ్యతలు వారికి అర్థమయ్యేందుకు లక్ష్మణరావు చేసిన రచన ఉపయోగపడు తుందని తెలిపారు. రచయిత, ఎమ్మెల్సీ కెఎస్.లక్ష్మణరావు మాట్లాడుతూ.. ప్రస్తుతం రాజ్యాంగంలో ప్రతిపాదించిన మౌలిక విలువలు, సూత్రాలు తెలుసుకోవాలన్నారు. రాజ్యాంగం గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని సూచించారు. మరో రచయిత రాం ప్రదీప్ మాట్లాడుతూ.. చరిత్రలో కీలకపాత్ర పోషించిన మహనీయులు అనేక కారణాల వల్ల మరుగునపడడం విషాదకరమన్నారు. యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ మాట్లాడుతూ రాజ్యాంగ లక్ష్యాలు క్షేత్రస్థాయికి చేరుతున్నాయా? లేదా? అనేది బాధ్యులందరూ సమీక్షించుకోవాలని సూచించారు. పుస్తకా లను ప్రచురించిన విజిఎస్ పబ్లిషర్స్ బాధ్యులు రామారావు సభలో పాల్గొన్నారు.
పలు పుస్తకాలు కొనుగోలు చేసిన పవన్ కల్యాణ్
విజయవాడ బుక్ ఫెస్టివల్ సొసైటీ ఆధ్వర్యంలో నగరంలోని ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో జరుగుతున్న 35వ పుస్తక మహోత్సవాన్ని శనివారం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సందర్శించారు. పుస్తక మహోత్సవంలో ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించి పలు పుస్తకాలను కొనుగోలుచేశారు. లిటిల్ బ్రైన్స్ పాఠశాల స్టాల్‌లో విద్యార్థులకు అందిస్తున్న పుస్తకాలను పరిశీలించారు. అలాగే విద్యార్థులకు సజనాత్మక విద్య అందిస్తున్న విధానం గురించి లిటిల్ బ్రైన్స్ పాఠశాల డైరెక్టర్ ఫణి ప్రసాద్ ముక్తేవి ఆయనకు వివరించారు. అలాగే స్పీకింగ్ ట్రీ గ్రామర్ పుస్తకాల గురించి పాఠశాల యాజమాన్యం వివరించింది.