– సవరణలతో వక్ఫ్ వ్యవస్థ బలహీనం
– సుప్రీంకోర్టు న్యాయవాది పొత్తూరి సురేష్ కుమార్
ప్రజాశక్తి – అమరావతి బ్యూరో :వక్ఫ్ చట్టానికి కేంద్రం నూతనంగా తీసుకొచ్చిన సవరణలను ఎవరూ కోరలేదు. కమిటీ లేదు, కనీసం అధ్యయనాలుగానీ, నివేదికలుగానీ లేవు. బిజెపి కార్యకర్తలు, ఆ పార్టీ న్యాయవాదులు వేసిన పిటీషన్లలో అడిగిన విధంగా ముస్లిములపై వివక్షాపూరితంగా, ఉద్దేశపూర్వకంగా సవరణలు తీసుకొచ్చారని కేంద్రం ఇటీవల తీసుకొచ్చిన వక్ఫ్ చట్టం సవరణ బిల్లుపై సుప్రీంకోర్టు న్యాయవాది పొత్తూరి సురేష్ కుమార్ ప్రజాశక్తికి ప్రత్యేక ఇంటర్వ్యూలో తెలిపారు.
ప్రశ్న : కేంద్రం వక్ఫ్ చట్టానికి సవరణలు ఎందుకు తెచ్చింది ? అవసరం ? అధ్యయనం ఏమైనా ఉన్నాయా ?
పొత్తూరి : ప్రస్తుతం సవరణలు తీసుకురావాల్సిన అవసరం లేదు. కమిటీ నివేదికలు గానీ, అధ్యయనాలు గానీ ఏమీ లేవు. గతంలో సచార్ కమిటీ, జాయింట్ పార్లమెంటరీ కమిటీ రిపోర్టులూ ఉన్నాయి. వాటిని అనుసరించి 2013లో మార్పులు తీసుకొచ్చారు. బిజెపి కార్యకర్తలు, లాయర్లు బిజెపి అధికారంలోకి వచ్చిన ఈ పదేళ్ల కాలంలో దేశంలో ఉన్న అనేక హైకోర్టుల్లో అలాగే సుప్రీంకోర్టులోనూ 1995 వక్ఫ్ చట్టం, దాని నిబంధనలపై కేసులు వేశారు. ఆ కేసుల సారాంశం ఏమిటంటే వక్ఫ్ చట్టం 1995, దాని బలోపేతం కోసం 2013లో తెచ్చిన సవరణలు రద్దు చేయాలని, అవి వక్ఫ్ వ్యవస్థకు అధికారాలు ఎక్కువ ఇచ్చిందని వారి వాదన. సెక్షన్ 40 ప్రకారం ఏదైనా భూమి వక్ఫ్ భూమి అని అనుమానం ఉంటే దాన్ని విచారణ జరిపి డిక్లేర్ చేసే అధికారం వక్ఫ్ ట్రిబ్యునల్‌కు ఉంది. దాన్ని ఛాలెంజ్ చేశారు.
ప్రశ్న : వక్ఫ్ అంటే ఏమిటి ?
పొత్తూరి : ఎవరైనా వ్యక్తి స్థిర, చరాస్తిని మతపరమైన, పవిత్రమైన కార్యకలాపాలు, దాన ధర్మాల కోసం ముస్లిం మత ప్రకారం జరిగే కార్యక్రమాల కోసం అంకితం చేస్తే దాన్ని వక్ఫ్ అంటారు. అది ముస్లిమేతరులు కూడా చేయొచ్చు. వందల వేల సంవత్సరాల నుండి ఇది ఉంది. అయితే దీన్ని ఎక్కువగా ముస్లిములు చేస్తారు. కొన్నిసార్లు రాజులు, మహరాజులు కూడా చేశారు. కొత్త సవరణ ప్రకారం కేవలం ముస్లిములు మాత్రమే వక్ఫ్ చేయాలి. కనీసం ఆ మతంలో చేరి ఐదేళ్లు ఆరాధించిన వారు మాత్రమే వక్ఫ్ చేయడానికి వీలవుతుందనే నిబంధన పొందుపరిచారు.
ప్రశ్న : సవరణలు 2013 వక్ఫ్ చట్టానికి అనుకూలంగా ఉన్నాయా ? ప్రతికూలంగా ఉన్నాయా ?
పొత్తూరి : సవరణలు వక్ఫ్ చట్టానికి, దాని లక్ష్యానికి పూర్తి వ్యతిరేకంగా ఉన్నాయి. వివక్షా పూరితంగా వాటిని రూపొందించారు. దీనివల్ల ముస్లిం ఆస్తులకు రక్షణ లేకపోగా, కొత్త సమస్యలను సృష్టించారు. ఉదాహరణకు వక్ఫ్ చట్టంలో 108ఏ అనేదానికి మిగతా చట్టాలతో పోలిస్తే అధికారం ఎక్కువగా ఉంది. దీన్ని బిజెపి కార్యకర్తలు, ఆ పార్టీ న్యాయవాదులు ఛాలెంజ్ చేశారు. సెక్షన్ 4 నుండి తొమ్మిది వరకు, అలాగే 52, 55, 107, 108, 108ఏను ఛాలెంజ్ చేశారు. ఏదైతే బిజెపి లాయర్లు, కార్యకర్తలు కోర్టుల్లో ప్రశ్నించారో వాటిని కేంద్రం తొలగించింది. వారు అడిగినవన్నీ కేంద్రం చేసింది.
ప్రశ్న : ప్రధానంగా వక్ఫ్ చట్టాన్ని బలహీనపరిచే అంశాలేమున్నాయి ?
పొత్తూరి : గతంలో వక్ఫ్ అనేదానికి విశాల నిర్వచనం ఉండేది. దాన్ని తగ్గించారు. గతంలో ఇది లిఖితపూర్వక డాక్యుమెంట్‌తో కాకుండా, నోటి ద్వారా ఆచరణలో వక్ఫ్ అమలు చేయడం అంటే వక్ఫ్ బై యూజర్ అంటారు. ఇటువంటి పద్ధతులను తొలగించారు. సెక్షన్ 104 ప్రకారం ఎవరైనా ముస్లిమేతరులు దర్గాలకు ఆస్తులు దానం చేస్తే దాన్ని కూడా వక్ఫ్ చట్టం ప్రకారమే నిర్వహిస్తారు. ఇప్పుడు 104 సెక్షన్‌ను తొలగించారు. ఇతర మతస్తులు ఇచ్చిన భూమి వక్ఫ్ కిందకు రాకుండా చేశారు. సెక్షన్ 3(6)లో, సెక్షన్ 9, 14లో సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్, బోర్డులు ఉంటాయి. వాటిల్లో కౌన్సిల్లో 20 మంది, బోర్డులో 12 మంది సభ్యులు ఉంటారు. కౌన్సిల్, బోర్డు రెండు కూడా చట్టాల ప్రకారం పేద ముస్లిములకు ఎలాంటి సేవలు అందించాలనే అంశంపై పనిచేస్తాయి. అలాంటి వాటిల్లో ఇద్దరు ముస్లిమేతరులు ఉండాలనే నిబంధన తీసుకొచ్చారు. కానీ వక్ఫ్ చేయడానికి ముస్లిమేతరులకు ఉన్న హక్కులను రద్దు చేసి, 104ను తొలగించి, ఆస్తులు ఎలా పరిపాలించాలనే అంశంలో ఇతరులను తీసుకురావడంపైనే అభ్యంతరాలు వస్తున్నాయి.
ప్రశ్న : వక్ఫ్ ఆస్తుల విషయంలో నిరంతరం వివాదాలు కొనసాగేలా ఏమైనా సవరణలు ప్రతిపాదించారా ?
పొత్తూరి : అవును, సెక్షన్ 6, 7 ప్రకారం ఏదైనా ఒక భూమి వక్ఫ్‌భూమా, ప్రభుత్వ భూమా అనే సమస్య వచ్చినప్పుడు లేదా షియాలదా, సున్నీలదా అనేదాన్ని వక్ఫ్ బోర్డు నిర్ణయిస్తుంది. అదే తుది పరిష్కారం అవుతుంది. దానిపై దావాలు వేయడానికి వీల్లేదు. అయితే వక్ఫ్ ట్రిబ్యునల్ మీద హైకోర్టుకు వెళ్లే అవకాశం మాత్రం ఉంటుంది. కొత్త చట్టంలో ఫైనల్ అనే పదాన్ని తొలగించి అన్ని కోర్టుల్లోనూ కేసులు వేసుకునే అవకాశం కల్పించారు. దీనిలో స్పష్టత లోపించింది. నిజంగా దీనిపై చిత్తశుద్ధి ఉంటే ట్రిబ్యునల్ తీర్పు ఫైనల్ కాకపోతే అప్పిలేట్ ట్రిబ్యునల్‌కు వెళ్లేలా ప్రతిపాదనలుగానీ, సూచనలుగానీ చేయాలి, కానీ అటువంటిదేమీ లేదు. దీనివల్ల సివిల్ కోర్టుకు వెళితే వెంటనే తీర్పులు వెలువడవు. దీర్ఘకాలం వివాదాలు కొనసాగుతాయి. వాస్తవంగా గతంలో ఉన్న చట్టంలో ఆరు, ఏడు సెక్షన్లలో ట్రిబ్యునల్ అధికారాల విషయాన్ని ప్రస్తావించిన సమయంలో అది ఇచ్చే ప్రతి తీర్పునూ తుది తీర్పు అని పొందుపరిచారు. కొత్తచట్టంలో తుది తీర్పు కాదు అని చేర్చారు. ఫలితంగా ట్రిబ్యునల్ తీర్పు చివరిది కాకుండా పోతుంది.
ప్రశ్న : వక్ఫ్ సర్వేలో తెచ్చిన సవరణలు ఏమిటి ? దీనివల్ల కలిగే నష్టం ఏమిటి ?
పొత్తూరి : వక్ఫ్ చట్టం 1995 సెక్షన్ 4లో సర్వే కమిషన్ వ్యవహారాలు ఉన్నాయి. దీని ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం అవసరాన్ని బట్టి సర్వే కమిషనర్‌ను, అసిస్టెంట్లను నియమించొచ్చు. 2024లో వచ్చిన సవరణలు ఏమిటంటే సర్వే కమిషనర్ అనే అంశాన్ని తొలగించారు. దాన్ని కలెక్టర్‌కు అప్పగించారు. దీనిలో పెండింగ్ అంటే సర్వే కమిషనర్ దగ్గర పెండింగ్‌లో ఉంటే సర్వే కమిషనర్ దాన్ని కలెక్టర్‌కు ట్రాన్స్‌ఫర్ చేయాలని, దాన్ని రెవెన్యూ చట్టాల్లో ఉన్న విధంగా సర్వే చేస్తారనే విధంగా నిబంధనలు పొందుపరిచారు. సెక్షన్ 5 ప్రిన్సిపల్ యాక్టులో ఒకసారి సర్వే చేసి గుర్తించిన తరువాత లిస్టును పబ్లిష్ చేస్తారు. దీన్ని పబ్లికేషన్ ఆఫ్ వక్ఫ్ అంటారు. దానిలోనూ మార్పులు తీసుకొచ్చారు. సర్వే చేసిన వివరాలను పోర్టల్‌లో అప్‌లోడ్ చేయాలి. దీనిలో వక్ఫ్ చేసిందెవరనే అంశాన్ని అప్‌లోడ్ చేయాలని తెలిపారు. ఫైనల్ జాబితా ప్రకటించిన తరువాత అభ్యంతరాలపై గతంలో ఏడాదిలోపు కేసులు వేసుకునే అధికారం ఉంటుంది. దాన్ని ప్రస్తుతం రెండేళ్లకు పొడిగించారు. అనంతరమూ కేసులు వేసుకునే అవకాశం కల్పించారు. అంటే వివాదం నిరంతరం కొనసాగుతుంది.
ప్రశ్న : ఈ చట్టంలో వక్ఫ్ బోర్డు, ట్రిబ్యునల్ అధికారాలను తగ్గించారా ?
పొత్తూరి : గతంలో ఎవరైనా వ్యక్తి వక్ఫ్ చేయాలనుకుంటే సెక్షన్ 36 ప్రకారం బోర్డుకు దరఖాస్తు చేసుకోవాలి. దీనిపై బోర్డు విచారణ జరుపుతుంది. ఇది కరెక్టా కాదా అనేది నిర్థారిస్తుంది. ప్రస్తుతం ఈ అధికారాలను కలెక్టర్‌కు ఇచ్చారు. ఆయన వివాదాలు ఉన్నాయని నివేదిక ఇస్తే పరిష్కారం అయ్యే వరకూ వక్ఫ్ చేయడానికి వీల్లేదు. కొత్తగా ప్రవేశపెట్టిన సెక్షన్ 3సిలో ఒక భూమి ప్రభుత్వ భూమి అని నిర్థారిస్తే అంటే ఐడెంటిఫైడ్, లేదా డిక్లేర్డ్ అనే పదాలు ఉపయోగించారు. అలా చేస్తే ఆ భూమి వక్ఫ్ భూమి కింద చెల్లుబాటు కాదు. దీనిపై కలెక్టర్ విచారణ జరిపి, ఆయన నివేదిక ప్రకారం వక్ప్ భూమిగా మారుతుంది. ప్రభుత్వ భూమిగా నిర్థారించేందుకు కలెక్టర్‌కు ఎక్కువ అధికారాలు ఇచ్చారు. అదే సమయంలో సెక్షన్ 40లో వక్ఫ్ భూమలుపై వక్ఫ్ బోర్డుకు ఉన్న అధికారాలను తొలగించారు. సెక్షన్ 52(ఏ)లో వక్ఫ్ భూములు అన్యాక్రాంతం అయితే కఠిన శిక్షలు ఉండేవి. అవన్నీ నాన్‌బెయిలబుల్, ఇప్పుడు వాటిని తొలగించారు. ఫలితంగా వక్ఫ్ భూములు అన్యాక్రాంతం అయితే తప్పు చేసిన వారు భయపడే పరిస్థితి ఉండదు. అంటే బెయిలబుల్, సాధారణ నేరాల మాదిరి మార్చారు. ఇది కూడా వక్ఫ్ వ్యవస్థకు వ్యతిరేకమైనదే. రిజిస్ట్రేషన్ పూర్తికాని కేసుల్లో ఏ కోర్టులో కేసులు వేయకూడదు అనే నిబంధన తీసుకొచ్చారు. అంటే కొత్త చట్టం ప్రకారం రిజిస్ట్రేషన్ జరగని వక్ఫ్ భూముల విషయంలో ఏ కోర్టు కూడా కేసులు స్వీకరించకూడదనే నిబంధన తెచ్చారు. ఇది కూడా వక్ఫ్ చేయాలనుకునేవారికి ఇబ్బంది కలిగించే నిబంధన.
