కలెక్టరేట్‌ ఎదుట రైతు ఆత్మహత్యాయత్నం

ప్రజాశక్తి-పుట్టపర్తి అర్బన్‌ : తన భూమిని కొందరు కబ్జా చేశారంటూ, దీనిపై అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదంటూ ఆరోపిస్తూ ఓ రైతు సోమవారం శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టరేట్‌ ఎదుట ఒంటిపై పెట్రోల్‌ పోసుకుని ఆత్మహత్యకు యత్నించారు. బాధితుడు తెలిపిన మేరకు…పుట్టపర్తి మండల పరిధిలోని నిడిమామిడి గ్రామానికి చెందిన దస్తగిరికి అదే గ్రామంలో 38 సెంట్ల సాగుభూమి ఉంది. ఇటీవల అదే గ్రామానికి చెందిన ఇద్దరు వైసిపి నాయకులు ఆ భూమిని కబ్జా చేశారు. ఈ విషయంపై పలుమార్లు రెవెన్యూ అధికారులకు రైతు ఫిర్యాదు చేశారు. న్యాయం లభించకపోవడంతో తీవ్ర మనస్తాపంతో కలెక్టరేట్‌ వద్దకు వచ్చి ఒంటిపై పెట్రోల్‌ పోసుకుని ఆత్మహత్యకు యత్నించారు. పోలీసులు వెంటనే స్పందించి అడ్డుకున్నారు. ఈ సంఘటన కలెక్టరేట్‌లో కలకలం రేపడంతో అధికారులు వెంటనే ఆయన వద్దకొచ్చి మాట్లాడారు. భూ ఆక్రమణకు పాల్పడిన వారిపై కేసు నమోదు చేయాలని పోలీసు అధికారులను జెసి, డిఆర్‌ఒ ఆదేశించారు. న్యాయం చేస్తామని అధికారులు నచ్చజెప్పి బాధిత రైతును ఇంటికి పంపించారు.

➡️