తలకు దెబ్బ తగిలి ఉపాధి కార్మికురాలు దుర్మరణం

ప్రజాశక్తి – సీతంపేట (పార్వతీపురం మన్యం జిల్లా) : ఉపాధి పనులు చేస్తుండగా జరిగిన ప్రమాదంలో ఉపాధి కార్మికురాలు దుర్మరణం చెందిన ఘటన పార్వతీపురం మన్యం జిల్లా సీతంపేట మండలంలో మంగళవారం చోటు చేసుకుంది. తోటి కార్మికులు తెలిపిన కథనం ప్రకారం… మండలంలోని బిల్లగూడ కాలనీలో రూ.మూడు లక్షలు ఉపాధిహామీ నిధులతో కొండ వద్ద టెర్రసింగ్‌ రాతి కట్టు పనులు జరుగుతున్నాయి. అదే కాలనీకి చెందిన సవర ఆదమ్మ (48), గంగమ్మ తోటి కార్మికులతో కలిసి ఉపాధి పనులకు వెళ్లారు. పనులు జరుగుతుండగా, పై నుంచి రెండు రాళ్లుఆదమ్మ తలపై, గంగమ్మ కాలుపై పడ్డాయి. ఆదమ్మ తీవ్రంగా గాయపడడంతో ఆమెను కుసిమి ప్రాథమిక ఆరోగ్యకేంద్రానికి తీసుకెళ్లారు. అక్కడ ప్రథమ చికిత్స అనంతరం శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు. రిమ్స్‌లో చికిత్స పొందుతూ ఆమె మృతి చెందారు. కాలికి గాయమైన గంగమ్మను పాలకొండ ఏరియా ఆస్పత్రికి తరలించారు. సీతంపేట ఎస్‌ఐ జగదీష్‌ నాయుడు దర్యాప్తు చేస్తున్నారు. ఆదమ్మకు భర్త తుంబయ్య, కుమార్తె ఉన్నారు. ఎపిఒ సాగర్‌ శ్రీకాకుళం రిమ్స్‌ ఆస్పత్రికి వెళ్లి మృతురాలి కుటుంబాన్ని, గాయపడిన గంగమ్మను పరామర్శించారు.

➡️