నిర్బంధంపై సమరశీల పోరాటం

 కొత్త పరిచయాలతో సంఘం బలోపేతం
 ఆదివాసీ ఉద్యమ నాయకులు లోతా రామారావు

ప్రజాశక్తి – కామ్రేడ్‌ సీతారాం ఏచూరి నగర్‌ (నెల్లూరు) : రాష్ట్ర ప్రభుత్వ నిర్బంధాన్ని ఎదుర్కొని పోరాటాలు నిర్వహించినట్లు ఆదివాసీ ఉద్యమ నాయకులు లోతా రామారావు తెలిపారు. సిపిఎం రాష్ట్ర మహాసభకు విచ్చేసిన ఆయన ప్రజాశక్తితో మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే.. ”ఆదివాసీ ప్రాంతాల్లో వంద శాతం ఉపాధ్యాయ పోస్టులు గిరిజనులకే చెందాలని, జిఒ నెం.3ని అమలు చేయాలని దశలవారీగా పోరాటాలు నిర్వహించాం. కలెక్టరేట్‌, ఐటిడిఎల ముట్టడి, మన్యం బంద్‌కు ఆదివాసీల నుంచి మంచి స్పందన వచ్చింది. ఈ ఆందోళనలతో యువతలోకి వెళ్లగలిగాం. బోయ వాల్మీకులను ఆదివాసీ తెగల్లో కలిపేందుకు రాష్ట్రప్రభుత్వం కుట్ర పన్నింది. దీనికి వ్యతిరేకంగా రాష్ట్ర బంద్‌ నిర్వహించారు. ఎంఎల్‌ఎలను, ప్రజాప్రతినిధులను అడ్డుకోవడంతో ఈ అంశం ఆదివాసీ ప్రజల్లో విస్తృత చర్చ జరిగింది. ప్రజలే తమ ఆందోళనతో స్వచ్ఛందంగా వీధుల్లోకి వచ్చారు. ఫలితంగా ఇతర పార్టీల నేతలు, ప్రజాప్రతినిధులు స్పందించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆదివాసీలకు వారి సొంత భాషల్లో విద్యా బోధన చేసేందుకు ప్రభుత్వం నియమించిన భాషా వలంటీర్లను ప్రభుత్వం రెన్యువల్‌ చేయలేదు. దీంతో వేలాదిమంది భాషా వలంటీర్ల జీవితాలు ప్రశ్నార్థకంగా మారాయి. దీనిపై సాగించిన పోరాట ఫలితంగా ప్రభుత్వం వెనక్కి తగ్గి రెన్యువల్‌ చేసింది.
ఏలూరు జిల్లా జీలుగుమిల్లి మండలం వంకవారిగూడెంలో నేవీ ఆయుధ డిపో ఏర్పాటుకు 1800 ఎకరాల ఆదివాసీల భూములను గుంజుకునేందుకు ప్రభుత్వం కుట్ర పన్నింది. ఈ డిపో ఏర్పాటుకు వ్యతిరేకంగా ఆ ప్రాంతంలోని గ్రామసభలన్నీ తీర్మానం చేశాయి. అయినప్పటికీ ప్రభుత్వం వెనక్కితగ్గలేదు. మరోమారు గ్రామసభ నిర్వహించగా, ప్రజలు ముక్తకంఠంతో వ్యతిరేకించి డిపో ఏర్పాటుకు వ్యతిరేకంగా తీర్మానం చేయడంతోపాటు మినిట్స్‌లో రాయించారు. దీంతో ప్రభుత్వం వెనుకడుగు వేసింది. పర్యాటక అభివృద్ధి పేరుతో 1/70 చట్టానికి సవరణ చేయాలని అసెంబ్లీ స్పీకర్‌ చింతకాయల అయ్యన్నపాత్రుడు చేసిన వ్యాఖ్యలతో గిరిజనుల్లో ఆందోళన నెలకొంది. దీనికి వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపట్టాం. ఈ కాలంలో ప్రతిరోజూ నిర్బంధాలను ఎదుర్కొంటున్నాం.”

➡️