మందుల కంపెనీలో అగ్నిప్రమాదం

– బాయిలర్‌ పేలుడుతో ఏడుగురు మృతి

– చూసేందుకు వెళ్లిన కంపెనీ ఎండి మృత్యువాత
– మృతుల కుటుంబాలకు న్యాయం చేయాలి: సిపిఎం
ప్రజాశక్తి – హైదరాబాద్‌ బ్యూరో :తెలంగాణ రాష్ట్రం సంగారెడ్డి జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. మందుల తయారీ కంపెనీ బాయిలర్‌ పేలి ఎగసిపడిన మంటలతో రియాక్టర్‌ విస్పోటనం చెంది కంపెనీ ఎండితో సహా ఏడుగురు కార్మికులు అగ్నికి ఆహుతయ్యారు. పదుల సంఖ్యలో కార్మికులు గాయపడ్డారు. వారిలో పలువురి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు తెలిసింది. పేలుడు, మంటల తీవ్రతకు ఫ్యాక్టరీ భవనం నేలమట్టమైంది. సంగారెడ్డి జిల్లా హత్నూర మండలంలోని చందాపూర్‌ గ్రామ పరిధిలో ఉన్న ఎస్‌బి ఆర్గానిక్‌ కెమికల్‌ ఫ్యాక్టరీలో బుధవారం సాయంత్రం 4.30 గంటల ప్రాంతంలో ఈ ఘోరం జరిగింది.
మందు బిల్లులకు పౌడర్‌ తయారుచేసే ఎస్‌బి కెమికల్‌ కంపెనీ 20 ఏళ్ల క్రితం స్థాపించారు. ప్రస్తుతం కంపెనీలో 150 మంది కార్మికులు పనిచేస్తున్నారు. వీరిలో అత్యధిక మంది హత్నూర మండల ప్రాంతానికి చెందిన వాళ్లే ఉన్నారు. అగ్ని ప్రమాదం జరిగిన షిఫ్ట్‌లో మాత్రం 50 మంది కార్మికులు విధుల్లో ఉన్నట్టు సమాచారం. కంపెనీలో ఉత్పత్తి జరుగుతున్న వేళ ఉష్ణోగ్రతలు పెరిగి ఉన్నట్టుండి బాయిలర్‌ పేలింది. రసాయనాల కారణంగా నల్లని దట్టమైన పొగతో మంటలు ఆ ప్రాంతాన్ని చుట్టేశాయి. మంటల తీవ్రతకు రియాక్టర్‌లో భారీ పేలుళ్లు సంభవించాయి. దాంతో కంపెనీ మొత్తం దట్టమైన పొగమబ్బులు కమ్ముకున్నాయి. అగ్నికీలలు ఎగసిపడ్డాయి. భారీ పేలుళ్ల వల్ల బాయిలర్‌, రియాక్టర్‌ వద్ద పనిచేస్తున్న కార్మికుల్లో కొందరు అక్కడికక్కడే మృతిచెందారు. కాలిన గాయాలతో పలువురు బయటకు పరుగులు తీశారు. కంపెనీలో ఏం జరుగుతుందోనన్న ఆందోళనతో చూసేందుకు లోపలికి వెళ్లిన కంపెనీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ రవి శర్మ, ప్రొడక్షన్‌ ఇన్‌చార్జీలు సుబ్రమణ్యం, దయానంద్‌తో పాటు మెయింటెనెన్స్‌ ఇన్‌చార్జి సురేష్‌ పాల్‌ కూడా మృతిచెందారు. కంపెనీ సిబ్బందితో పాటు కార్మికులు కలిపి ఏడుగురు మరణించినట్టు ప్రాథమికంగా గుర్తించారు. పేలుళ్ల దాటికి, మంటల వల్ల 30 మందికి పైగా కార్మికులు తీవ్ర గాయాలపాలయ్యారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. సమచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది ఐదుఫైర్‌ ఇంజన్లతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. సంగారెడ్డి ఎస్‌పి చెన్నూరి రూపేష్‌ సంఘటనా స్థలానికి చేరుకుని సహాయ చర్యలను పర్యవేక్షించారు. సంఘటనా స్థలాన్ని మంత్రి కొండా సురేఖ సందర్శించారు. అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు.
మృతుల కుటుంబాలను ఆదుకోవాలి:సిఐటియు
ప్రమాదంలో మరణించిన మృతుల కుటుంబాలను ఆదుకోవాలని సిఐటియు జిల్లా అధ్యక్షులు బి.మల్లేశం, కోశాధికారి కె.రాజయ్య డిమాండ్‌ చేశారు. మరణించిన కార్మికుల కుటుంబాలకు రూ.50 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని, క్షతగాత్రులకు మెరుగైన ఉచిత వైద్యం అందించాలని డిమాండ్‌ చేశారు. తక్షణమే జిల్లాలోని ఫ్యాక్టరీలను తనిఖీ చేసి సేఫ్టీ మెజర్‌మెంట్స్‌ లేని కంపెనీలను సీజ్‌ చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి జయరాజ్‌ డిమాండ్‌ చేశారు.

➡️