ప్రజాశక్తి-తాడిపత్రి : బంగారం కొనుగోలు విషయంలో అకారణంగా నిందితున్ని చేసి పోలీసులు వేధింపులకు గురి చేస్తున్నారన్న అవమాన భారాన్ని భరించలేక పోలీసు స్టేషన్ ఎదుట సైనెడ్ మింగి బంగారు నగల వ్యాపారి ఆత్మహత్య చేసుకున్నారు. అనంతపురం జిల్లా తాడిపత్రి పోలీసు స్టేషన్ ఎదుట శుక్రవారం చోటు చేసుకున్న ఈ ఘటన తీవ్ర సంచలనం రేపింది. మృతుని కుటుంబసభ్యులు తెలిపిన వివరాల మేరకు…అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణం మెయిన్ బజార్‌లో బర్కత్ జ్యువెల్లరీ షాపును ఎన్.చిన్న గౌసుల్లా (50) నిర్వహిస్తున్నారు. తాడిపత్రికి చెందిన జిలాన్ అనే వ్యక్తి ముత్తూట్ ఫైనాన్స్‌లో అడ్వయిజర్‌గా పని చేస్తుండేవాడు. ఈ సమయంలో పూల హాజి అనే వ్యక్తి పది తులాల బంగారాన్ని ముత్తూట్ ఫైనాన్స్‌లో జిలాన్ సహాయంతో తాకట్టు పెట్టాడు. పూల హాజికి తెలియకుండా అతని బంగారాన్ని జిలాన్ విడిపించి, బంగారు వ్యాపారి గౌసుల్లాకు విక్రయించాడు. దీంతో పూలహాజి గౌసుల్లా ఇంటి వద్దకు వెళ్లి తన బంగారం అమ్మిన విషయంపై ఆరా తీశాడు. తనకు నాలుగు తులాలు మాత్రమే అమ్మాడని గౌసుల్లా చెప్పడంతో పోలీసులను ఆశ్రయించాడు. ఈ క్రమంలో పోలీసులు మూడు రోజుల క్రితం గౌసుల్లాని పోలీసు స్టేషన్‌కు పిలిపించి విచారించారు. శుక్రవారం కూడా మరోసారి విచారించారు. తనను అకారణంగా పోలీసు స్టేషన్ చుట్టూ తిప్పుతూ అవమానిస్తున్నారని భావించి విచారణ అనంతరం స్టేషన్ బయటకు వచ్చి సైనెడ్ మింగారు. పోలీసులు వెంటనే ఆయన్ను స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మరణించినట్లు తెలిపారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
