లంక గ్రామాల వరద బాధిత స్కీమ్‌ వర్కర్లకు చేయూత

  • సిఐటియు ఆధ్వర్యాన నిత్యవసర వస్తువులు పంపిణీ

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : సెప్టెంబరు మొదటి వారంలో కురిసిన భారీ వర్షాలు, వరదలకు దెబ్బతిన్న కార్మికులకు, స్కీమ్‌ ఉద్యోగులకు సిఐటియు చేయూతనందించింది. వరదల్లో దెబ్బతిన్న లంక గ్రామాల్లోని అంగన్‌వాడీ, ఆశా, మధ్యాహ్న భోజనం పథకం, యానిమేటర్స్‌, పంచాయతీ కార్మికులు సుమారు 200 మందికి సిఐటియు రాష్ట్ర కమిటీ రూ.800 విలువ చేసే నిత్యావసర వస్తువుల కిట్లను ఆదివారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సిఐటియు రాష్ట్ర కార్యదర్శి కె ధనలక్ష్మి, ఎపి భవన నిర్మాణ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి ఆర్‌వి నరసింహారావు, మధ్యాహ్న భోజన పథకం కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దయా రమాదేవి మాట్లాడారు. కృష్ణా నదీ పరివాహక ప్రాంతంలోని లంక గ్రామాల్లో వివిధ పథకాల్లో పనిచేస్తున్న కార్మికులతో పాటు అసంఘటిత రంగంలోని భవన నిర్మాణం, ముఠా కార్మికులు వరదలతో సర్వం కోల్పోయారన్నారు. బాధ్యత కలిగిన సిఐటియు కార్మికులకు అన్ని సందర్భాల్లో అండగా ఉంటుందని, ఈ నేపథ్యంలోనే 200 కార్మిక కుటుంబాలకు నిత్యవసర వస్తువులు, దుస్తులు పంపిణీ చేస్తున్నామని తెలిపారు. నిత్యం పోరాటంలో ముందుండే సిఐటియు వరదల్లో అనేక మందికి అన్నదానాలు, కిట్ల పంపిణీని చేపట్టిందని తెలిపారు. కృష్ణా నది లంక గ్రామాల్లో సర్వం కోల్పోయిన కార్మికులను ఆదుకునేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో 108 మెడికల్‌ అండ్‌ హెల్త్‌ ఉద్యోగుల సంఘం నాయకులు గీత, సిఐటియు నాయకులు సిహెచ్‌ మజుందార్‌, అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ నాయకులు కె ఝాన్సీ, ఆశావర్కర్ల సంఘం నాయకులు వెంకటేశ్వరమ్మ, ప్రజా సంఘాల నాయకులు టి కృష్ణమోహన్‌, బి అగస్టీన్‌, టి సురేష్‌, జి సుధాకర్‌, బి సుబ్బారావు, పి నాగమల్లేశ్వరరావు, కృపానందం, దివ్య తదితరులు పాల్గొన్నారు.

➡️