- క్యాబినెట్ నిర్ణయం
- రిజిస్ట్రార్‌కు ప్రభుత్వ లేఖ
పజాశక్తి – అమరావతి బ్యూరో : కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని రాష్ట్ర మంత్రిమండలి నిర్ణయించింది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధ్యక్షతన బుధవారం సచివాలయంలో జరిగిన క్యాబినెట్ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. హైకోర్టు బెంచ్‌తో పాటు ఈగల్ పేరుతో యాంటీ నార్కోటిక్ విభాగాన్ని కూడా కర్నూలులో ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. కేబినెట్ నిర్ణయం అనంతరం ఇదే విషయాన్ని హైకోర్టు రిజిస్ట్రార్‌కు ప్రభుత్వం తెలియచేసింది. న్యాయశాఖ కార్యదర్శి ఈ మేరకు లేఖ రాశారు. రాయలసీమలోని ఎనిమిది జిల్లాల్లో 1.59 కోట్ల మంది ప్రజలున్నారని, రాష్ట్ర జనాభాలో వీరు 25శాతమని లేఖలో తెలిపారు. ఈ ప్రాంతం నుండి విజయవాడకు రావడానికి ఒకేఒక రైలు ఉందని , దీంతో సామాన్యులు అనేక ఇబ్బందులు పడుతున్నారని హైకోర్టు దృష్టికి తీసుకువచ్చారు. అదే సమయంలో హైకోర్టు బెంచ్‌లు ఉన్న వివిధ రాష్ట్రాల జాబితాను కూడా పేర్కొన్నారు. కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని న్యాయవ్యవస్థ దృష్టికి తీసుకుపోవాలని కోరారు. దీనితో పాటు నేరాల నియంత్రణ కోసం పిడి యాక్ట్‌ను మరింత పటిష్టపరచాలని క్యాబినెట్ సమావేశంలో నిర్ణయించారు. దీనికోసం రూపొందించిన చట్ట సవరణ బిల్లుకు కూడా మంత్రిమండలి ఆమోద ముద్ర వేసినట్లు తెలిసింది. అమరావతినిర్మాణ పనులు కొనసాగించేందుకు సాంకేతిక కమిటీ ప్రతిపాదనలకు మంత్రి మండలి ఆమోదించినట్లు, దానిలో భాగంగా అమరావతి పనులకు కొత్తగా టెండర్లు పిలవాలని మంత్రి మండలి నిర్ణయించినట్లు తెలిసింది. రూ.85 వేలకోట్లపెట్టుబడులకు సంబంధించి ఎస్‌ఐపిబి తీసుకున్న నిర్ణయాలకు కూడా మంత్రిమండలి ఆమోదం తెలిపింది.