హైదరాబాద్: హైదరాబాద్ మీర్ పేట్ లో దారుణమైన హత్య జరిగింది. అనుమానంతో అతి క్రూరంగా తన భార్యను హత్య చేశాడు శాడిస్ట్ భర్త. హత్య చేసి అత్తామామలతో కలిసి భార్య కనిపించడం లేదంటూ పోలీసు స్టేషన్ కి వెళ్లి ఫిర్యాదు చేశాడు. పోలీసుల దర్యాప్తులో ఘోరమైన నిజాలు బయటపడ్డాయి. వివరాల్లోకి వెళితే.. డి ఆర్ డి ఓలో ఔట్సోర్సింగ్ సెక్యూరిటీగా పనిచేస్తున్న గురుమూర్తి కుటుంబంతో హైదరాబాద్ మీర్ పేట్ లో నివసిస్తున్నారు. పథకం ప్రకారం సంక్రాంతి పండుగ సందర్భంగా వారి ఇద్దరు పిల్లలను అత్తావారికి పంపాడు. భార్య మాధవిపై అనుమానంతో ఉన్న గురుమూర్తి ఆమెను అతి కిరాతంగా హత్య చేసి, ఆమె అవయవాలను ముక్కలు ముక్కలు చేశాడు. ఆ ముక్కలను కుక్కర్ లో ఉడికించి, ఎముకలను ఆరబెట్టి పొడిగా చేశాడు. వాటిని దగ్గరలో ఉన్న ఓ చెరువులో పడేశాడు. ఇంట్లో రక్తం మరకలు, వాసన గుర్తు పట్టకుండా ఆన్లైన్ లో సెర్చ్ చేసి తెప్పించుకున్న కెమికల్స్ వాడినట్లు తెలుస్తోంది. ఈ హత్యకు ముందు ఓ కుక్కను చంపాడు. మాధవి మృతదేహం నుండి వస్తున్న వాసన చనిపోయిన కుక్కదిగా చుట్టుప్రక్క వాళ్లను నమ్మించాడు. మూడు రోజుల తరువాత అత్తమామలకు ఫోన్ చేసి తాము ఇద్దరం గొడవ పడ్డామని, మాధవి కోపంతో ఇళ్లు వదిలి వెళ్లిపోయిందని చెప్పాడు. దీంతో వారందరూ కలిసి 18వ తేదీన పోలీసు స్టేషన్ కు వెళ్లి మాధవి మిస్సింగ్ కేసు నమోదు చేశారు. పోలీసులు సిసి ఫూటేజ్ పరిశీలించగా ఇంట్లో నుండి మాధవి బయటకు రాలేదని గుర్తించారు. కానీ అనేకసార్లు గురుమూర్తి ఇంట్లో నుంచి బయటకు వచ్చినట్టు పోలీసులు గుర్తించారు. దీంతో గురుమూర్తిని విచారించగా అసలు నిజం తెలిసింది. ఆయన చెప్పిన విషయాలు విని పోలీసులు సైతం నివ్వెరపోయ్యారు. ఆయన మాటలను నమ్మలేని పోలీసులు సాక్ష్యాలు దొరికిన తరువాత గురుమూర్తి చెప్పినవి నిజమని నిర్ధారణకు వచ్చారు. దీంతో కేసు నమోదు చేసి, గురుమూర్తిని అరెస్టు చేశారు.
