ప్రజాశక్తి-రాయదుర్గం : పుట్టింటికి వెళ్ళిన భార్య తిరిగి మెట్టినింటికి రాలేదని కోపంతో కత్తితో భార్య గొంతు కోసిన ఘటన అనంతపురం జిల్లా గుమ్మగట్ట మండలం కలుగోడు గ్రామంలో ఆదివారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. మండలంలోని గలగల గ్రామానికి చెందిన వన్నూరు స్వామికి అదే మండలంలోని కలుగోడు గ్రామానికి చెందిన బోయ జ్యోతితో 8 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ముగ్గురు సంతానం. భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు కారణంగా జ్యోతి పుట్టింటికి కలుగోడుకు వెళ్ళగా ఆమెను తీసుకుని వచ్చేందుకు కలుగోడుకు వెళ్లిన వన్నూరు స్వామి ఆదివారం తెల్లవారుజామున నిద్రిస్తున్న భార్య గొంతును కత్తితో కోసి పరారయ్యాడు. ఈ విషయం గమనించిన కుటుంబ సభ్యులు గుమ్మగట్ట పోలీసులకు సమాచారం అందించారు. శవాన్ని పరీక్ష నిమిత్తం రాయదుర్గం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.