- పోలీసు స్టేషన్‌లో లొంగిపోయిన నిందితుడు
ప్రజాశక్తి-లేపాక్షి : అనుమానం పెనుభూతమై కట్టుకున్న భార్యను భర్త కడతేర్చాడు. నిద్రిస్తున్న భార్య గొంతుకోసి హత్య చేశాడు. అనంతరం పోలీసుల ఎదుట లొంగిపోయాడు. సంచలనం రేపిన ఈ ఘటన శ్రీసత్యసాయి జిల్లా లేపాక్షి మండలం కొండరు గ్రామంలో మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు… లేపాక్షికి చెందిన శేఖర్‌కు అదే మండలం కొండూరు గ్రామానికి చెందిన ఈశ్వరమ్మ (32)తో 11 ఏళ్ల క్రితం వివాహం అయ్యింది. వీరికి తొమ్మిదేళ్ల హేమంత్, ఆరేళ్ల జస్వంత్ కుమారులు ఉన్నారు. గత రెండు సంవత్సరాలుగా ఈశ్వరమ్మపై అనుమానంతో భార్యతో గొడవపడేవాడు. వారి వివాదాలు అధికమవ్వడంతో ఈశ్వరమ్మ తండ్రి తిప్పన్న కుమార్తెను కొండూరులోని పుట్టింటికి తీసుకువెళ్లారు. ఈ క్రమంలో మంగళవారం శేఖర్ కొండూరు గ్రామానికి వెళ్లి భార్యను ఇంటికి తీసుకెళ్తానని చెప్పి వారింట్లోనే రాత్రి ఉన్నాడు. అందరూ నిద్రించిన తర్వాత చురకత్తితో ఈశ్వరమ్మ గొంతు కోసి హత్య చేశాడు. అనంతరం లేపాక్షి పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ నరేంద్ర తెలిపారు.