మాధవరం ‘ఆత్మహత్యల’పై జ్యుడిషియల్‌ విచారణ జరపాలి

  •  రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో అఖిలపక్ష నాయకుల డిమాండ్‌
  • నేడు కలెక్టరేట్‌ వద్ద ఆందోళన

ప్రజాశక్తి – కడప అర్బన్‌/ఒంటిమిట్ట : వైఎస్‌ఆర్‌ జిల్లా ఒంటిమిట్ట మండలం మాధవరం గ్రామానికి చెందిన పాల సుబ్బారావు, ఆయన భార్య పద్మావతి, కూతురు వినయ ఆత్మహత్యకు కారకులైన రెవెన్యూ అధికారులు, అధికార పార్టీ నేతలపై క్రిమినల్‌ కేసులు నమోదు చేసి విచారణ జరిపి నిందితులను శిక్షించాలని, కుటుంబానికి కోటి రూపాయల పరిహారం, పెద్ద కూతురు లక్ష్మిప్రసన్నకు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని అఖిలపక్ష నాయకులు డిమాండ్‌ చేశారు. ఈ కేసుపై జ్యూడిషియల్‌ విచారణ జరపాలని, దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. బాధిత కుటుంబానికి రూ. పది లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని నిర్ణయించామని లోకేష్‌ చెప్పారు.
సోమవారం స్థానిక ప్రెస్‌క్లబ్‌లో సిపిఐ ఆధ్వర్యంలో రౌండ్‌టేబుల్‌ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జి.ఈశ్వరయ్య, జిల్లా కార్యదర్శి చంద్ర, సిపిఎం జిల్లా కార్యదర్శి జి.చంద్రశేఖర్‌, టిడిపి సీనియర్‌ నాయకులు జి.లక్ష్మిరెడ్డి, కాంగ్రెస్‌ నాయకులు ఎస్‌.ఎ.సత్తార్‌, ఆప్‌ జిల్లా నాయకులు డాక్టర్‌ శ్రీనివాసులు, లోక్‌సత్తా పార్టీ నాయకులు కష్ణ, సిఆర్‌వి ప్రసాద్‌ తదితరులు మాట్లాడారు. మృతుడి తండ్రి పాల చలపతి…సోమశిల ప్రాజెక్టు నిర్మాణం కోసం అట్లూరు మండలంలో భూములు, ఇల్లు త్యాగం చేసి, ఒంటిమిట్ట మండలంలోని మాధవరం గ్రామంలో నివాసం ఉంటూ, ఒంటిమిట్ట గ్రామ పొలంలో మూడు ఎకరాల ప్రభుత్వ భూమిని సాగు చేసుకునేవారని వివరించారు. రెవెన్యూ రికార్డుల్లో కూడా భూమిని నమోదు చేయించారని తెలిపారు. కరోనా సమయంలో ఆయన చనిపోయారన్నారు. రెండో కుమారుడైన సుబ్బారావు తన ఇద్దరూ కుమార్తెల చదువు, తమ్ముడి వివాహం, ఆర్థిక సమస్యలు, రుణదాతల ఒత్తిడి తాళలేక తండ్రి ద్వారా సంక్రమించిన పొలాన్ని విక్రయించి అప్పులు తీర్చాలని అనుకున్నారని చెప్పారు. అప్పులు, వ్యక్తిగత కారణాలతో సుబ్బారావు కుటుంబం చనిపోయినట్లు డిఎస్‌పి షరీఫ్‌ ప్రకటించడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయన్నారు. మంగళవారం వైఎస్‌ఆర్‌ జిల్లా కలెక్టరేట్‌ వద్ద నిర్వహించే ఆందోళనలో పాల్గొనాలని కోరారు.
రూ. పది లక్షలు ఎక్స్‌గ్రేషియా : లోకేష్‌
సుబ్బారావు కుమార్తె లక్ష్మి ప్రసన్నను ఫోన్‌లో టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్‌ ఓదార్చి తాము ఉన్నామని భరోసా ఇచ్చారు. టిడిపి తరుపున బాధిత కుటుంబానికి రూ.10 లక్షలు ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని నిర్ణయించామని చెప్పారు. సుబ్బారావు కుటుంబం రోడ్డున పడడానికి వైసిపి ప్రభుత్వమే కారణమని టిడిపి నాయకులు, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. మృతుల కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించారు.
రూ.కోటి ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలి : కర్నూలు ఎంపి
పాల సుబ్బారావు కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.కోటి ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని కర్నూలు పార్లమెంట్‌ సభ్యులు సింగరి సంజీవ్‌కుమార్‌ డిమాండ్‌ చేశారు. మృతుల కుటుంబాన్ని కొత్తమాధవరంలో ఆయన పరామర్శించారు. ఇక్కడ పెత్తందారి వ్యవస్థ పేదల రక్తాన్నీ అన్నంలో కలుపుకొని తింటుందని విమర్శించారు.

➡️