- దస్తగిరి ఫిర్యాదుతో నలుగురిపై కేసు నమోదు
ప్రజాశక్తి-పులివెందుల టౌన్ : మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. అప్రూవర్‌గా మారిన దస్తగిరి ఫిర్యాదు మేరకు నలుగురిపై జీరో ఎఫ్‌ఐఆర్‌తో ఈ నెల మూడున పులివెందుల పట్టణ పోలీసుస్టేషన్‌లో కేసు నమోదు చేశారు. 341, 506, 323, 195 (ఎ), 330 ఐ/డబ్ల్యు, 109 ఐపిసి సెక్షన్లు, మరికొన్ని సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ కేసులో వివేకా హత్య కేసులో నిందితుడిగా ఉన్న దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి కుమారుడు డాక్టర్ చైతన్యరెడ్డి, జమ్మలమడుగులో డిఎస్‌పిగా చేసిన నాగరాజు, ఎర్రగుంట్లలో సిఐగా పనిచేసిన ఈశ్వరయ్య, కడప కేంద్ర కారాగారం సూపరింటెండెంట్‌గా చేసిన ప్రకాష్ ఉన్నారు. 2023 అక్టోబర్‌లో దస్తగిరి బంధువుల అమ్మాయి ప్రేమ వివాహ విషయంలో అతనిపై ఎస్‌సి, ఎస్‌టి కేసు నమోదు చేశారు. ఈ కేసులో దస్తగిరిని ఏడ్రోజులపాటు చీకటి గదిలో ఉంచి పోలీసులు చితకబాదినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. 2023 అక్టోబర్ నుంచి ఫిబ్రవరి 2024 వరకు కడప జైల్లో దస్తగిరి రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఈ క్రమంలో వివేకా కేసులో వైసిపి నేతలకు మద్దతుగా మాట్లాడాలని డిఎస్‌పి నాగరాజు, నవంబర్ 2023లో కడప జైలుకు వచ్చి సిబిఐ ఎస్‌పి రామ్‌సింగ్‌కు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పాలని చైతన్యరెడ్డి బెదిరించారని దస్తగిరి ఫిర్యాదు చేశారు. రామ్‌సింగ్‌కు వ్యతిరేకంగా మాట్లాడితే రూ.20 కోట్లు ఇస్తామని చెప్పినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. వారితోపాటు కడప కేంద్ర కారాగారం సూపరింటెండెంట్ ప్రకాష్ కూడా ఇబ్బంది పెట్టినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.