పోలింగ్‌ కేంద్రాల్లో భారీ ఎత్తున ఓటర్లు

May 13,2024 18:44 #votesr

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో
సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్‌లోని అసెంబ్లీ, పార్లమెంట్‌ స్థానాలకు సోమవారం సాయంత్రం 5 గంటల సమయానికి 67.99 శాతం పోలింగ్‌ నమోదైంది. ఉదయం మందకొడిగా ప్రారంభమైన పోలింగ్‌ మధ్యాహ్నం స్వల్ఫ ఘర్షణలు, ఇవిఎంలు పనిచేయకపోవటం, విద్యుత్‌ అంతరాయాలు తదితర కారణాలతో పోలింగ్‌ ఆలస్యమైంది. సాయంత్రం 3 గంటల నుంచి ఓటర్లు పోలింగ్‌ కేంద్రాలకు రావటం పెరిగింది. అయితే ఒకేసారి రెండు ఓట్లు వేయాల్సిరావటంతో కొంత ఆలస్యం జరుగుతోంది. ఎప్పటికప్పుడు ఎన్నికల కమిషన్‌ పర్యవేక్షణ చేస్తున్నా పల్నాడు జిల్లా నరసరావుపేట లాంటి చోట్ల రబ్బరుబుల్లెట్ల కాల్పుల వరకూ పరిస్థితి వెళ్లింది. కొన్ని జిల్లాల్లో ఎస్పీల కారుపైనే వేర్వేరు పార్టీల కార్యకర్తలు అదుపుతప్పి దాడులకు పాల్పడ్డారు. గుంటూరు పశ్చిమలో పోలింగ్‌ జరుగుతున్న సమయంలో వైసిపికి ఓటు వేయాలని విడుదల రజని తరపున ఐవిఆర్‌ఎస్‌ కాల్స్‌ చేయటంతో టిడిపి అభ్యర్థి పోలీసులకు ఫిర్యాదుచేశారు. దీంతో సైబర్‌ క్రైం పోలీసులు 249/24 నంబరుతో ఎఫ్‌ఐఆర్‌ కట్టారు. పల్నాడు జిల్లా గురజాలలో మూడు కేంద్రాల్లో వైసిపి కార్యకర్తలు ఇవిఎంలను పగులగొట్టారు. ఎచ్చెర్ల ఎమ్మెల్యే గొర్లె కిరణ్‌ను ధర్మవరం గ్రామస్తులు రావొద్దని అడ్డుకున్నారు. పల్నాడు జిల్లాలో జరిగిన హింసపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తంచేశారు. ఎన్నిసార్లు ఫిర్యాదుచేసినా ఇసి స్పందించటం లేదని ఇప్పటికైనా పరిస్థితులను వెంటనే చక్కదిద్దాలని కోరారు. కుప్పం నియోజకవర్గం పరిధిలోని పలు పోలింగ్‌ కేంద్రాల్లో వైసిపి అభ్యర్థి భరత్‌ టిడిపి ఏజెంట్లపై దాడికి దిగి పోలింగ్‌ కేంద్రాల తలుపులు మూసివేశారు. టిడిపి కార్యకర్తలు తిరగబడి తలుపులు తీసి ఓటింగ్‌ను కొనసాగించారు. చీరాల మండలం గవినివారిపాలెంలో టిడిపి అభ్యర్థి కొండయ్యపై వైసిపి కార్యకర్తలు దాడిచేశారు. గన్నవరం మండలం సూరంపల్లి వద్ద టిడిపి, వైసిపి నాయకుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. చిత్తూరు జిల్లా కృష్ణాపురంలో వైసిపి ఏజెంట్‌ సురేష్‌పై కత్తితో దాడి జరిగింది. ఐపిఎస్‌ అధికారి ఎబి వెంకటేశ్వరరావు, మాజీ అధికారి ఆర్‌పి ఠాకూర్‌ టిడిపికి అనుకూలంగా సూచనలు ఇస్తున్నారంటూ వైసిపి నాయకులు ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదుచేశారు. చంద్రగిరిలో కేంద్రబలగాలు గాల్లోకి కాల్పులు జరిపాయి. వైసిపి ఎమ్మెల్యేలు అన్నాబత్తుని శివకుమార్‌, పిన్నెళ్లి రామకృష్ణారెడ్డి, జూలకంటి బ్రహ్మారెడ్డిలను గృహ నిర్భంధం చేయాలని ఎన్నికల కమిషన్‌ ఆదేశించింది.

➡️