భువనగిరి: యాదాద్రి భువనగిరి జిల్లాలో బీరు బాటిళ్లతో వెళ్తున్న లారీ ఘోర రోడ్డు ప్రమాదానికి గురైంది. చౌటుప్పల్ మున్సిపల్ పరిధిలోని లక్కారం స్టేజీ సమీపంలో విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారిపై లారీ ఆగి ఉంది. ఈ క్రమంలో మరో లారీ వేగంగా వచ్చి ఆగి ఉన్న లారీని వెనుక నుంచి బలంగా డీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు. ఇక ఈ రెండు లారీల్లో ఒకటి ఉల్లిపాయలు.. మరొకటి బీర్లు లోడు. ఈ ప్రమాదం కారణంగా రెండు ట్రక్కుల సరుకు రోడ్డుపై పడిపోయింది. బీరు బాటిళ్లు, ఉల్లిపాయలు రోడ్డుపై పడిపోవడంతో స్థానికులు అక్కడికి చేరుకున్నారు. దీంతో వాటిని తీసుకునేందుకు జనం ఎగబడ్డారు. ఇక మందు బాబులు బీరు సీసాలు తెచ్చుకునేందుకు రోడ్డంతా నిండిపోయారు.
ఈ క్రమంలో ఆ రోడ్డుపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. అక్కడ మృతదేహాన్ని వెలికితీశారు. ట్రాఫిక్ జామ్‌ను తొలగించే ప్రయత్నం చేశారు. ప్రమాదం జరిగినప్పుడు కొంతమంది సహాయం చేయడం మానేసి సరుకుల కోసం ఎగడబడటం మరికొందరిని ఆశ్చర్యానికి గురి చేసింది.
