ప్రజాశక్తి – తిరుపతి సిటీ : తిరుపతి ఎస్‌వి జూ పార్క్ రోడ్డులో టిటిడి ఉద్యోగిని చిరుత గాయపరిచింది. ఈ ఘటనతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. కార్మికుల కథనం మేరకు … తిరుమల అశ్వని ఆస్పత్రిలో పనిచేస్తున్న డి. మునికుమార్ శనివారం మధ్యాహ్నం విధులు ముగించుకొని, ద్విచక్ర వాహనంలో అలిపిరి చెర్లోపల్లి బైపాస్ రోడ్‌లో వెళ్తున్నారు. తిరుపతి జూపార్క్‌లోని సైన్స్ సెంటర్ సమీపంలో ఆయనపై చిరుత దాడి చేసింది. సమీపంలోని వ్యక్తులు గట్టిగా కేకలు వేయడంతో చిరుత అక్కడి నుంచి పారిపోయింది. గాయపడిన మునికుమార్‌ను స్విమ్స్ ఆస్పత్రికి తరలించారు. రెండు రోజుల క్రితం, తిరుపతి తొక్కిసలాటలో గాయపడిన బాధితులను పరామర్శించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మాజీ సిఎం జగన్‌మోహన్‌రెడ్డి, పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు పరామర్శించిన రోజు ఉదయం ఆ ప్రాంతానికి కేవలం వంద మీటర్ల దూరంలో శ్రీ పద్మావతి మహిళా వైద్య కళాశాల సమీపంలోని క్వార్టర్స్‌లో నివసిస్తున్న సిబ్బంది ఇంటి ముందు ఉన్న కుక్కపిల్లను చిరుత దాడి చేసి నోట కరుచుకుని వెళ్లిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అటవీ శాఖ అధికారులు స్పందించి, చిరుతను బంధించి తమను కాపాడాలని స్థానికులు కోరుతున్నారు.