కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజావ్యతిరేక విధానాలపై భారీ నిరసన ర్యాలీ

  • రాష్ట్రపతి, ప్రధాని, సిఎంలకు హెచ్చరిక నోటీసులు

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజావ్యతిరేక విధానాలపై కార్మిక, కర్షక లోకం కదంతొక్కింది. రైతు, కార్మికులు, శ్రామికులు, మహిళల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ రైతు, కార్మిక సంఘాలు, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో విజయవాడ తుమ్మలపల్లి కళా క్షేత్రం నుంచి పిడబ్ల్యూడి గ్రౌండ్స్‌లోని డాక్టర్‌ బి.ఆర్‌ అంబేద్కర్‌ విగ్రహం వరకూ భారీ ర్యాలీని మంగళవారం నిర్వహించారు. కేంద్ర కార్మిక సంఘాలు, సంయుక్త కిసాన్‌ మోర్చా పిలుపు మేరకు నిర్వహించిన ఈ ర్యాలీలో వేలాదిగా పాల్గొన్న రైతులు, కార్మికులు, వ్యవసాయ కూలీలు తదితర వర్గాలకు చెందిన వారు ఎర్రజెండాలు చేతబూని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు యు.ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం పూర్తిగా కార్పోరేట్‌ అనుకూల విధానాలను అవలంభిస్తోందని చెప్పారు. రైతులకు పంట రుణాలు మాఫీ చేయాలని కోరితే స్పందించని ప్రభుత్వం కార్పోరేట్లకు మాత్రం ఇప్పటి వరకూ 17 లక్షల కోట్లు బ్యాంక్‌ రుణాలను మాఫీ చేసిందన్నారు. బ్రిటీష్‌ ప్రభుత్వం నుంచి పోరాటాలు చేస్తూ కార్మిక సంఘాలు సాధించిన కార్మిక చట్టాలను పక్కన పెట్టి లేబర్‌ కోడ్‌లను తీసుకువచ్చిందన్నారు. డాక్టర్‌ బి.ఆర్‌ అంబేద్కర్‌ రాసిన రాజ్యాంగం ఇదే చెప్పిందా అంటూ ప్రధానిని ప్రశ్నించారు. ముడుపులు అందుకుని అదానీకి అనుకూలంగా ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలపై ఇప్పుడు అమెరికాలో కేసులు నడుస్తున్నాయని చెప్పారు. ప్రభుత్వ రంగంలోని పరిశ్రమలను కాపాడాలని కోరారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణను ఉపసంహరించుకోవాలన్నారు. ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌, స్పీడ్‌ ఆఫ్‌ డూయింగ్‌ అంటూ పెట్టుబడిదారులకు అనుకూల విధానాలను రాష్ట్ర ప్రభుత్వం అవలంభిస్తోందన్నారు. మహిళలపై అత్యాచారాలు భారీగా పెరుగుతున్నాయని, వీటిని అరికట్టడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని చెప్పారు. ఎపి రైతు సంఘాల సమన్వయ సమితి కన్వీనర్‌ వడ్డే శోభనాధ్రీశ్వరరావు మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతు, కార్మిక వ్యతిరేక విధానాలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఢిల్లీలో రైతు సంఘాల ఉద్యమం సందర్భంగా ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేయాలన్నారు. రైతు సంఘం నాయకులు వై.కేశవరావు మాట్లాడుతూ స్వామినాధన్‌ కమిషన్‌ సిపార్సులను అమలు చేయాలని, కమిషన్‌ సిఫార్సు చేసిన విధంగా పంటలకు మద్ధతు ధరలు ప్రకటించాలని కోరారు. ఎఐటియుసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.ఓబులేసు, నాయకులు జి.కోటేశ్వరరావు, కిషోర్‌ తదితరులు ఈ సందర్భంగా మాట్లాడారు.

అనంతరం కలెక్టరేట్‌కు చేరుకుని సిఎం, ప్రధాని, రాష్ట్రపతిలకు పంపేందుకు హెచ్చరిక నోటీసులను ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌ లక్ష్మీశాకు అందజేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు ఎ.వి నాగేశ్వరరావు, సిఐటియు రాష్ట్ర నాయకులు కె.ఉమామహేశ్వరరావు, కె.ధనలక్ష్మి, ఆర్‌.వి నర్సింహారావు, కెఆర్‌కె మూర్తి, కె.సుభాషిణి, ఎ.వెంకటేశ్వరరావు, అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుబ్బరామ్మ, రైతు సంఘం నాయకులు కె.వి.వి ప్రసాద్‌, ఎఐటియుసి నాయకులు సాంబశివరావు, సుధీర్‌, టియుసిఐ రాష్ట్ర నాయకులు పోలవరపు కృష్ణ, ఇఫ్టూ రాష్ట్ర నాయకులు పి.ప్రసాద్‌, పి.పోలారి, రామకృష్ణ, ఎఐసిసిటియు నాయకులు ఈశ్వర్‌, నల్లమడ రైతు సంఘం నాయలకు కొల్లా రాజమోహన్‌, డి.హరినాధ్‌, మహిళా సంఘం నాయకురాలు పద్మ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

➡️