కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విధానాలపై ఉద్యమం

Jan 16,2025 07:52 #AP Rythu Sangam, #Prabhakar Reddy

రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రభాకర్‌ రెడ్డి
ప్రజాశక్తి – దేవనకొండ (కర్నూలు) : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఉద్యమించాలని రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.ప్రభాకర్‌రెడ్డి పిలుపునిచ్చారు. హంద్రీనీవా కింద ఉన్న ప్రతి ఎకరాకూ సాగు నీరు, రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్‌ చేశారు. సామాన్య, పేద, మధ్యతరగతి ప్రజలపై మోపిన విద్యుత్‌ చార్జీలపై ఉద్యమించాలని తెలిపారు. మంగళవారం సంక్రాంతి సందర్భంగా మండలంలోని పి.కోటకొండ గ్రామంలో రైతుసంఘం, డివైఎఫ్‌ఐ ఆధ్వర్యంలో ‘ఐక్యత కోసం ఆటలు-యువత మైత్రికి బాటలు’ అనే నినాదంతో కబడ్డీ, ముగ్గుల పోటీలు నిర్వహించారు. రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి సూరి సంజన అధ్యక్షత వహించారు. ముగ్గులు, కబడ్డీ పోటీల్లో విజేతలకు బహుమతులను అందించారు.
ప్రజానాట్యమండలి కళాకారులు విప్లవ గీతాలను ఆలపించారు. ఈ సందర్భంగా కోడుమూరు ఎస్‌ఐ శ్రీనివాసులు మాట్లాడారు. కోటకొండలో మినీ ఇండియా కనిపిస్తోందని, కుల మతాలకతీతంగా అందరూ ఐక్యంగా ప్రతేడాది సంక్రాంతి సంబరాలు జరుపుకోవడం అభినందనీయమని తెలిపారు. పిల్లలను బాగా చదివించాలని, చదువే గౌరవాన్ని అందిస్తుందని చెప్పారు. డివైఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి నగేష్‌ మాట్లాడుతూ… దేశంలో పేదరికం, నిరుద్యోగం, డ్రగ్స్‌ ప్రమాదకరంగా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు. అందరమూ ఐక్యంగా ఉండి మతోన్మాదాన్ని, నిరుద్యోగాన్ని, డ్రగ్స్‌ మాఫియాను అరికడదామని కోరారు.

➡️