భూ ఆక్రమణదారులపై కఠిన చర్యలు : సభ ముందుకు కొత్త చట్టం

ప్రజాశక్తి -అమరావతి బ్యూరో : భూ ఆక్రమణ దారులపై కఠిన చర్యలు తీసుకోవడానికి అవకాశం కల్పించే ‘ఏపీ ల్యాండ్‌ గ్రాబింగ్‌(నిషేధ) బిల్లు-2024’ను శాసనసభలో ప్రవేశపెట్టినట్లు రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్‌ చెప్పారు. ఇప్పటివరకు అమలులో ఉన్న చట్టంలో పలు సవరణలు తీసుకు వచ్చారు.

కొత్త చట్టంలో ఇలా…
. భూ దురాక్రమణకు పాల్పడిన వారికి 10-14 సంవత్సరాల జైలు శిక్షతో పాటు, ఆక్రమించిన భూముల మార్కెట్‌ విలువ కంటే జరిమానా విధించే అవకాశాన్ని ఈ చట్టం కల్పిస్తుంది. భూ దురాక్రమణ చేసి, భూమిని విక్రయించినా లేదా కేటాయించినా, ప్రభుత్వం అటువంటి ఆస్తులను దురాక్రమణ భూములుగా గుర్తించనుంది. ఇతరుల భూములను ఆక్రమించడమే కాకుండా, దౌర్జన్యం, బెదిరింపు, బలప్రయోగం వంటి చర్యలకు పాల్పడిన వారిని భూ దురాక్రమణదారులుగా గుర్తించడం జరుగుతుంది. భూముల ఆక్రమణలో కంపెనీలు కూడా పాల్గొన్నట్లయితే, అప్పటి ఇన్‌చార్జి లేదా అధికారులను బాధ్యులుగా గుర్తించి శిక్షలు విధించాలని చట్టంలో పేర్కొన్నారు.

ప్రత్యేక న్యాయస్థానాలు
భూ దురాక్రమణ కేసుల త్వరిత పరిష్కారానికి హైకోర్టు అనుమతితో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక న్యాయస్థానాలను ఏర్పాటు చేయవచ్చు. ప్రతి ప్రత్యేక కోర్టుకు పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ను నియమించ నున్నారు, తద్వారా భూ దురాక్రమణ కేసుల్లో సము చిత న్యాయం అమలు చేస్తామని బిల్లులో పేర్కొన్నా రు. ప్రత్యేక న్యాయస్థానం భూములను స్వాధీనం చేసుకునే అధికారం కలిగి ఉంది.ఆక్రమించిన భూములను ఖాళీ చేయించి, అసలు యజమానికి తిరిగి అప్పగించేందుకు ప్రత్యేక న్యాయస్థానం ఆదేశాలు జారీ చేయవచ్చని బిల్లులో పేర్కొన్నారు.

➡️