ప్రజాశక్తి-విజయవాడ : విజయవాడ నగరంలో విరిగి పడుతున్న కొండ చరియలతో బిక్కిబిక్కుమంటూ కొండ ప్రాంతవాసుల రక్షణ, అభివృద్ధికి 100 కోట్ల రూపాయల ప్యాకేజీ ప్రకటించాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్.బాబురావు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. నేడు విజయవాడ పశ్చిమ నియోజకవర్గం పాతబస్తీలోని 50, 51వ డివిజన్లలో కొండ ప్రాంతాల్లో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్.బాబురావు, సిపిఎం కార్పొరేటర్ బోయి సత్యబాబు తదితర సిపిఎం నేతలు పర్యటించారు. విజయవాడ నగరంలో కొండచరియలు విరిగిపడిన ప్రాంతాలను పరిశీలించారు. గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలతో బిక్కుబిక్కుమంటున్న ప్రజలను పరామర్శించారు. పనులు లేక ఇబ్బందులు పడుతున్న ప్రజలను కలుసుకొని వారి కష్టాలు తెలుసుకున్నారు. 50వ డివిజన్ గొల్లపాలెంగట్టు ప్రాంతంలో గత రెండు, మూడు సంవత్సరాలుగా రక్షణ గోడలు కూలిన ప్రాంతాలను పరిశీలించారు. 51వ డివిజన్ కొత్తపేట కొండ ప్రాంతంలో నిన్న విరిగిపడిన కొండ చరియలు, దెబ్బతిన్న ఇళ్లను చూశారు. నష్టపోయిన బాధితులను పరామర్శించారు. ఈ సందర్భంగా బాబురావు, సత్యబాబు మాట్లాడుతూ…. ” విజయవాడ నగరంలో 16 డివిజన్లలో రెండు లక్షల మంది కొండ ప్రాంతాల్లో నివసిస్తున్నారు. పశ్చిమ నియోజకవర్గంలోనే 12 డివిజన్లలో కొండ ప్రాంతవాసులు ఉన్నారు. ఇటీవల కురుస్తున్న వర్షాలతో పలు ప్రాంతాల్లో కొండ చరియలు విరిగిపడుతున్నాయి. ఇల్లు దెబ్బతిన్నాయి. మరికొన్ని ప్రాంతాల్లో కొండ చరియలు విరిగిపడే ప్రమాదం ఉంది. ప్రజలు బిక్కుబిక్కుమంటూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని జీవిస్తున్నారు. గత ప్రభుత్వం, విజయవాడ నగరపాలక సంస్థ పాలకపక్షం కొండ ప్రాంతవాసులను నిర్లక్ష్యం చేశాయి. రక్షణ గోడలు కట్టకుండా కాలయాపన చేశారు. దీనివలన ప్రజల ప్రాణాలకు ముప్పు వాటిల్లుతున్నది. రక్షణ కొరవడింది. ప్రజా సమస్యలను విస్మరించి ప్రజా ప్రతినిధులు పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారు. అభివృద్ధి కార్యక్రమాలకు, ప్రజల రక్షణకు నిధులు కేటాయించలేదు. తెలుగుదేశం కూటమి కొండ ప్రాంతవాసులను ఆదుకుంటామని చెప్పి అధికారంలోకి వచ్చారు. నగరములోనూ, పాతబస్తీలోనూ కొండప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజల రక్షణకు, రక్షణ గోడల నిర్మాణానికి, అభివృద్ధి కార్యక్రమాలకు 100 కోట్ల రూపాయల ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించాలి. నగరపాలక సంస్థ తక్షణమే 10 కోట్ల రూపాయలు కేటాయించాలి. రక్షణ గోడల నిర్మాణం చేపట్టాలి. మెట్లు, కాలువలు, రోడ్లు రిపేర్లు చేయాలి. మంచినీరు, డ్రైనేజీ, లైటింగ్ తదితర సౌకర్యాలను మెరుగుపరచాలి. కొండ ప్రాంతాల్లో నిలిచిపోయిన అభివృద్ధి కార్యక్రమాలను పునరుద్ధరించాలి. తక్షణ ప్రమాదం నివారించడానికి మున్సిపల్, రెవెన్యూ, ఫైర్ తదితర శాఖల సిబ్బందితో ప్రత్యేక బృందాలు ఏర్పరచాలి. ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్న ప్రాంతాలను గుర్తించాలి. తక్షణ నివారణ చర్యలు చేపట్టాలి. పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు కేంద్రం నుండి ప్రత్యేక ప్యాకేజీ నిధులు పొందటానికి కృషి చేయాలి. కొండ చరియలులు విరిగిపడిన ప్రాంతాల్లో తక్షణమే రక్షణ గోడలు నిర్మించాలి. దెబ్బతిన్న ఇళ్లను పునర్ నిర్మించాలి. బాధితులకు ఆర్థిక సహాయం అందించాలి. నగరపాలక సంస్థ మేయర్, పాలకపక్షం మొద్దు నిద్ర వీడి, కొండ ప్రాంత వాసులను ఆదుకోవాలి. విజయవాడ నగరంలోనూ ,రాష్ట్రంలోనూ పలు ప్రాంతాల్లో భారీ వర్షాలతో ప్రజలు తీవ్రంగా నష్టపోయారు. పనులు కోల్పోయారు, ఆస్తి నష్టపోయారు. పంటలు దెబ్బతిన్నాయి. ఈ తరుణంలో అధికార, ప్రధాన ప్రతిపక్ష పార్టీలు ఒకరిపై మరొకరు ఆరోపణలు, ప్రత్యారోపణలతో మునిగిపోకుండా, ప్రజలను ఆదుకోవటంపై దృష్టి పెట్టాలి. రాబోయే అసెంబ్లీ సమావేశాల్లోనూ ప్రజలను ఆదుకోవటానికి, సహాయ చర్యలపై చర్చించాలి. కేంద్రం నిధులు ఇవ్వాలి, రాష్ట్ర ప్రభుత్వం తక్షణం స్పందించాలి. ప్రజలను అన్ని విధాల ఆదుకోవాల”ని తెలిపారు. నేడు జరిగిన ఈ పర్యటనలో సిపిఎం నేతలు సూరిబాబు, ఇవి నారాయణ , రాజు, నాగా, బాషా, సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.
