- నార్పల ప్రాథమిక వైద్యశాల ఘటన
- మృతదేహంతో ఆందోళనకు దిగిన బంధువులు
ప్రజాశక్తి – నార్పల : అనంతపురం జిల్లా నార్పల ప్రాథమిక వైద్యశాలలో ఇంజక్షన్ వికటించి వ్యక్తి మృతిచెందాడు. గురువారం తెల్లవారుజామున జరిగిన ఈ ఘటనపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నైట్‌డ్యూటీలో ఉన్న నర్స్ భర్త సూదిమందు వేయడం వల్లనే తన భర్త మృతిచెందాడని మృతుని భార్యతో పాటు, ఎంఆర్‌పిఎస్ నాయకులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి మృతుని బంధువులు, వైద్యసిబ్బంది తెలిపిన వివరాల మేరకు…మండల కేంద్రంలోని బేల్దారి కాలనీకి చెందిన కుళ్లాయప్ప (38) గురువారం అర్ధరాత్రి అస్వస్థతకు గురికావటంతో తెల్లవారుజామున మూడు గంటల సమయంలో కుటుంబ సభ్యులు నార్పల ప్రాథమిక వైద్యశాలకు తరలించారు. అక్కడ కుళ్లాయప్పకు ఇంజక్షన్ వేశారు.
కొద్ది సేపటికే అతను మృతిచెందాడు. వైద్యశాలలో నైట్ డ్యూటీలో ఉన్న నర్సు(ఎఫ్‌ఎన్‌ఒ) భర్త ఇంజక్షన్ వేయడం వల్లనే తన భర్త మృతిచెందాడని మృతుని భార్య, ఎంఆర్‌పిఎస్ నాయకులు ఆరోపించారు. ఈ మేరకు వారు ఆసుపత్రి ఎదుట ఆందోళకు దిగారు. అయితే ఇంజక్షన్ తానే వేశానని తనకు ఆరోగ్యం బాగా లేకపోతే తన భర్త తోడుగా వచ్చాడని నర్సు అంటున్నారు. ఈ నేపథ్యంలో ఎవరు ఇంజక్షన్ వేశారో తెలుసుకోవడానికి పోలీసులు వైద్యశాలలోని సిసి కెమెరా ఫుటేజీలను పరిశీలించడానికి ప్రయత్నించగా అవి పనిచేయడం లేదని వైద్య సిబ్బంది తెలిపారు. మృతినిభార్య దేవి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సిఐ తెలిపారు.