ప్రభుత్వ జాబితాలో ప్రజాకవులకు స్థానం లేదా ?

  • తెలుగు జాతి వికాసానికి పునాదులేసిన కవులను మరచిపోవడం తగదు : తెలకపల్లి రవి

ప్రజాశక్తి – గ్రేటర్‌ విశాఖ బ్యూరో : ప్రభుత్వ జాబితాలో ప్రజాకవులకు స్థానం లేదా? అని ప్రముఖ రచయిత, రాజకీయ విశ్లేషకులు, సీనియర్‌ జర్నలిస్టు తెలకపల్లి రవి ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర రాజకీయ, సాంస్కృతిక ఒత్తిడిలో ఉన్నట్టు అనిపిస్తోందన్నారు. విశాఖలో ఎవరికి ఎక్కడ భూములివ్వాలి, విశాఖ ఉక్కును ఎలా ప్రయివేట్‌ వాళ్లకివ్వాలి వంటి విషయాలే తప్ప తెలుగు జాతి వికాసానికి పునాదులు వేసిన గురజాడ, కందుకూరి, జాషువాలను రాష్ట్ర ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన తెలుగు కవుల జాబితాలో విస్మరించడం అభ్యంతరకరమని, అచారిత్రకమని అన్నారు. తెలుగు భాషా వైతాళికులుగా జాతిని తమ కవిత్వం ద్వారా ఉత్తేజపరిచి మేల్కొలిపిన వీరిని మరచిపోతే తెలుగు ప్రజలు సహించబోరని ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు. విశాఖలోని అల్లూరి విజ్ఞాన కేంద్రంలో మాజీ ఎమ్మెల్సీ ఎంవిఎస్‌.శర్మ, సాహితీ స్రవంతి ప్రతినిధులు చలపతి, రామారావులతో కలిసి ఆయన సోమవారం విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ఏడాది పొడవునా తలచుకోవాల్సిన ప్రముఖుల జయంతులు, వర్థంతుల జాబితాను ప్రభుత్వం ఇటీవల విడుదల చేయగా ఒక్క కవయిత్రి మొల్ల పేరు మాత్రమే అందులో ఉందని, గురజాడ, కందుకూరి, జాషువా వంటి వారి పేర్లు కనబడకుండా పోయాయని తెలిపారు. రాష్ట్ర విభజన జరిగాక సాంస్కృతిక పునరుజ్జీవనం కోసం పనిచేయాలన్న ఆలోచన ప్రభుత్వానికి లేదన్నారు. జాబితాను సవరించి కందుకూరి, జాషువా, గురజాడ, చాసో, రావిశాస్త్రి, ఆదిభట్ల నారాయణదాసుల పేర్లను చేర్చాలని డిమాండ్‌ చేశారు. విద్య, వైజ్ఞానిక రంగాలకు ఊపిరిలూదిన ఆంధ్రా యూనివర్సిటీ శతాబ్ది ఉత్సవాలు జరుగుతున్న వేళ ఆ వర్సిటీ తొలి విసి కట్టమంచి రామలింగారెడ్డి నుంచి ఇప్పటి వరకూ ఉన్న విద్యావేత్తలు, సాంస్కృతికవేత్తలకు గుర్తింపు కలిగిన ఈ ప్రాంగణాన్ని చంద్రబాబు విస్మరించడం బాధాకరమన్నారు. విశ్వనాథ సత్యనారాయణకు వేయి పడగలపై గుర్తింపు లభించింది ఎయులోనేనని, సర్వేపల్లి రాధాకృష్ణ ఇక్కడి వారేనని గుర్తు చేశారు. గ్రంథాలయాల పునర్వికాస ఉద్యమం విజయవాడలో మొదలైందని, సాహితీ స్రవంతి దీనికి మద్దతు ఇస్తోందని తెలిపారు. కవుల పుస్తకాలకు ప్రభుత్వం ప్రాచుర్యం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. నేడు మీడియా విశ్వసనీయత విలేకర్లపై ఆధారపడి కాకుండా మీడియా సంస్థలపై ఆధారపడి ఉందన్నారు. ఈ నేపథ్యంలో రచయితల భావ ప్రకటనా స్వేచ్ఛకు భంగం కలిగించకూడదని వెల్లడించారు. కాశ్మీర్‌లో ఉగ్రదాడిని అవకాశంగా తీసుకుని మతానికి అన్వయించకూడదని తెలిపారు.

➡️