- జిఓ 117ను రద్దు చేయాలి
- పిడిఎఫ్ ఎమ్మెల్సీ ఐ వెంకటేశ్వరరావు
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రంలో గత ప్రభుత్వం విద్యారంగాన్ని ధ్వంసం చేసిందని పిడిఎఫ్ ఎమ్మెల్సీ ఐ వెంకటేశ్వరరావు విమర్శించారు. ఎన్నికలకు ముందు చేసిన వాగ్దానం మేరకు ప్రాథమిక విద్యను నిర్వీర్యం చేసిన జిఓ నెంబరు 117ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. మంగళవారం శాసనసభా ఆవరణలోని మీడియా పాయింట్‌లో ఎమ్మెల్సీ ఐ వెంకటేశ్వరరావు మాట్లాడారు. గవర్నరు ప్రసంగంలో కేవలం ల్యాండ్ టైట్లింగ్ యాక్టు, పెన్షన్‌ల పెంపు, ఉచిత ఇసుక, అన్న క్యాంటీన్లు ఇలా కొన్నింటినే ప్రస్తావించారని, ఎన్నికలకు ముందు ప్రకటించిన మేనిఫెస్టోపై స్పష్టత లేదన్నారు. విద్యారంగంలో కీలకమైన ప్రాథమిక విద్యను ముక్కలు చేసేలా జిఓ 117 తీసుకురావడంతో లక్షలాది మంది విద్యార్థులు పాఠశాలలకు దూరమయ్యారని అన్నారు. 4,500 పాఠశాలల్లో 3, 4, 5 తరగతులను రద్దు చేయడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు. గత ప్రభుత్వ నిర్ణయాలతో రాష్ట్రంలోని 7,200 పాఠశాలల్లో ఒక్క విద్యార్థి కూడా చేరలేదన్నారు. 20 వేల పాఠశాలల్లో ఎన్‌రోల్‌మెంటు 15 కంటే తక్కువకు పడిపోయిందని తెలిపారు. అలాగే హైస్కూల్స్‌లో ఒక్క ఎన్‌రోల్‌మెంట్ లేని పాఠశాలలు 505 వున్నాయన్నారు. ఈ ఏడాది 6 లక్షల మంది విద్యార్థులు పాఠశాలలకు దూరమయ్యారని తెలిపారు. గత ప్రభుత్వం డిఎస్‌సిని నిర్వహించకుండా ఖాళీలను మాయం చేసేపనికి పూనుకుందని అన్నారు. అలాగే ఉన్నత విద్యను కూడా ధ్వంసం చేశారని విమర్శించారు. ఉన్నత విద్యకు ఫీజ్ రీయింబర్స్‌మెంటు ఎత్తివేసిందన్నారు. రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్దీ రెండూ సమాంతరంగా ముందుకు సాగాలంటే కేంద్ర ప్రభుత్వం విభజన హామీలను అమలు చేయాలన్నారు. విభజన హామీల అమలుకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి పెంచాలన్నారు. అలాగే రాష్ట్రంలో తక్షణం ప్రభుత్వ భవనాలను నిర్మించి ప్రభుత్వ కార్యాలయాలకు అద్దె చెల్లింపుల నుంచి ఉపశమనం కల్పించాలన్నారు. రాష్ట్రంలో కాంట్రాక్టు, అవుట్‌సోర్సింగ్, ఇతర స్కీమ్ వర్కర్లందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు.