- ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రంలో విద్యుత్ వినియోగదారులపై ఒక్క రూపాయి ఛార్జీ భారం మోపేది లేదని ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. శాసన సభలో బుధవారం జరిగిన డిమాండ్లపై చర్చలో భాగంగా మంత్రి మాట్లాడుతూ… విద్యుత్ కొనుగోళ్లను 60 శాతం తగ్గించినట్లు తెలిపారు. ఎపి జన్‌కో విద్యుత్ ఉత్పత్తిని పెంచిందన్నారు. 2014-19 మధ్య రాష్ట్రంలో మిగులు విద్యుత్ ఉండగా, గత ప్రభుత్వం ఈ రంగాన్ని అస్థవ్యస్థం చేసిందన్నారు. ధర్మల్ పవర్ ప్లాంట్లులో ఉత్పత్తి నిలిపివేసి ప్రైవేటు సంస్థల నుంచి అధిక మొత్తం చెల్లించి విద్యుత్ కొనుగోలు చేసిందన్నారు.
చంద్రన్న బీమా అమలుపై కమిటీ
రాష్ట్రంలో చంద్రన్న బీమా పథకం అమలుపై సిఎస్ నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేసినట్లు కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ తెలిపారు. శాసనసభలో డిమాండ్లపై చర్చలో భాగంగా మంత్రి సమాధానమిస్తూ… గత ప్రభుత్వ హయాంలో 3,553 మంది వివిధ ప్రమాధాల్లో చనిపోతే కేవలం 942 మందికే బీమా చెల్లించారన్నారు. మిలిన వారికి వాలంటీర్లనతో తప్పుడు నివేదికలు సేకరించి బీమా లేకుండా చేశారని చెప్పారు. భవన నిర్మాణ కార్మికుల బోర్డును పునర్యవస్థీకరించి, నిలిపివేసిన 12 పథకాలను అమలు చేస్తామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 9 చోట్ల ఇఎస్‌ఐ ఆసుపత్రులు ఏర్పాటుకు ప్రతిపాదించామన్నారు.
పట్టణ ప్రాంతాల్లో 1.50 కోట్ల మంది జనాభా
గ్రామాల నుంచి పట్టణాలకు ప్రజలు వలస రావడంతో పట్టణ జనాభా 1.50 కోట్లకు చేరిందని పురపాలక శాఖ మంత్రి నారాయణ తెలిపారు. శాసన సభలో డిమాండ్లపై చర్చకు సమాధానమిస్తూ… మున్సిపాలిటీల్లో నిధుల కొరతను పరిష్కరించేందుకు సిఎఫ్‌ఎంఎస్‌తో సంబంధం లేకుండా మున్సిపాలిటీల్లో నిధులు అక్కడే ఖర్చు చేసకునేలా నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. ఈ బడ్జెట్‌లో మున్సిపల్ శాఖకు 13,862.29 కోట్లు కేటాయించారని, గత బడ్జెట్ కంటే 17 శాతం అధికమన్నారు. అమృత్ 2.0లో రూ.10వేల కోట్లతో హైబ్రిడ్ యాన్యుటీ విధానంలో తాగునీటి పథకం రూపొందించామన్నారు.