ఒకే సిలబస్‌ అమలు చేయాలి

May 22,2024 08:58 #press meet, #utf

-ఉపాధ్యాయులకు బోధనేతర పనులు ఎత్తివేయాలి
-యుటిఎఫ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కెఎస్‌ఎస్‌ ప్రసాద్‌
ప్రజాశక్తి- కర్నూలు కలెక్టరేట్‌ :వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు ఒకే సిలబస్‌ విధానాన్ని అమలు చేయాలని యుటిఎఫ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కెఎస్‌ఎస్‌ ప్రసాద్‌ డిమాండ్‌ చేశారు. ఉపాధ్యాయులకు బోధనేతర పనులు పూర్తిగా ఎత్తివేయాలని, విద్యార్థులకు బోధించేందుకు ఉపాధ్యాయులకు సమయం ఉండేలా చూడాలని కోరారు. మంగళవారం ఆయన కర్నూలులో మీడియాతో మాట్లాడారు. ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకూ ప్రాథమిక పాఠశాలలను ఒకేచోట పెట్టాలని కోరారు. జిఒ నెంబర్‌ 117ను వెంటనే రద్దు చేయాలని, రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న 23 వేల ఉపాధ్యాయ పోస్టులన్నింటినీ భర్తీ చేయాలని డిమాండ్‌ చేశారు. 1998-2008 డిఎస్‌సి ద్వారా నియమితులైన ఎంటిఎస్‌ ఉపాధ్యాయులను, ట్రైబల్‌ వెల్ఫేర్‌ స్కూళ్లలో పనిచేస్తున్న సిఆర్‌టిలను రెగ్యులరైజ్‌ చేయాలని కోరారు. రాష్ట్రంలో నూతన విద్యా విధానాన్ని అమలు చేయకుండా ప్రస్తుతం ఉన్నటువంటి విద్యావిధానాన్ని మరింత బలోపేతం చేసేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఉపాధ్యాయుల సమస్యలన్నిటినీ పరిష్కరించాలని కోరారు. విలేకర్ల సమావేశంలో యుటిఎఫ్‌ రాష్ట్ర సహాధ్యక్షుడు కె.సురేష్‌కుమార్‌, జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రవికుమార్‌, నవీన్‌పాటి, జిల్లా సహాధ్యక్షుడు హేమంత్‌ కుమార్‌ పాల్గొన్నారు.

➡️