ట్రాఫిక్‌ సిగ్నల్‌ పై పాము..! గంటసేపు ట్రాఫిక్‌ జాం..!

హిమాయత్‌నగర్‌ (తెలంగాణ) : ట్రాఫిక్‌ సిగ్నల్‌ పై త్రాచుపాము కనిపించడంతో వాహనదారులంతా భయంతో ఆగిపోయారు.. దీంతో ఓ గంటపాటు ట్రాఫిక్‌ నిలిచిపోయిన ఘటన శుక్రవారం సాయంత్రం లిబర్టీ చౌరస్తాలో జరిగింది. నిన్న సాయంత్రం లిబర్టీ చౌరస్తా సిగ్నల్‌ వద్ద ఉన్న వేప చెట్టుపై మొదట పాము కనిపించింది. అక్కడి నుండి కేబుల్‌ వైర్ల సహాయంతో ట్రాఫిక్‌ సిగ్నల్‌ పైకి చేరింది. నిత్యం ట్రాఫిక్‌ తో రద్దీగా ఉండే సిగ్నల్‌ వద్ద ఒక్కసారిగా పాము కనిపించడంతో వాహనదారులు ఖంగుతిన్నారు. ఆ పాము ఎక్కడ మీద పడుతుందో అని ఎక్కడికక్కడ తమ వాహనాలను నిలిపివేశారు. దీంతో సుమారు గంట పాటు ట్రాఫిక్‌ జామ్‌ అయ్యింది. కొద్దిసేపటికి సిగ్నల్‌ పోల్‌ సహాయంతో కిందకు చేరిన పాము.. పక్కనే ఖాళీగా ఉన్న బిల్డింగ్‌ సెల్లార్‌ లోకి వెళ్లింది. దీంతో వాహనదారులు, పోలీస్‌ సిబ్బంది ఊపిరిపీల్చుకున్నారు. కాగా కొందరు ఈ దృశ్యాలను సెల్‌ఫోన్లలో బంధించారు.

➡️