- మంత్రి నాదెండ్ల మనోహర్
ప్రజాశక్తి – బుట్టాయగూడెం (ఏలూరు జిల్లా) : ఏజెన్సీలో సమస్యలను ప్రాధాన్యతా క్రమంలో పరిష్కరిస్తామని జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఏలూరు జిల్లా బుట్టాయగూడెంలో ఆయన బుధవారం పర్యటించారు. తొలుత కెఆర్‌పురం ఐటిడిఎలో కొత్త అంబులెన్స్‌ను పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజుతో కలిసి ప్రారంభించారు. అనంతరం పులిరామన్నగూడెంలో గిరిజన వెదురు హస్తకళల ప్రదర్శన తయారీ కేంద్రాన్ని సందర్శించారు. గిరిజనులు తయారు చేసిన వెదురు హస్త కళలను పరిశీలించారు. తయారీ వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం గ్రామస్తులతో ముఖాముఖి నిర్వహించారు. గ్రామానికి బస్సు సర్వీసు లేదని గ్రామస్తులు తెలపగా వారం రోజుల్లో బస్సు సర్వీసు ప్రారంభమవుతుందని హామీ ఇచ్చారు. ఏడు కిలోమీటర్ల దూరంలో కన్నాపురం నుంచి తాగునీరు తెచ్చుకుంటున్నామని చెప్పడంతో తక్షణమే ట్యాంకర్ ద్వారా తాగునీరు అందించాలని ఐటిడిఎ పిఒను మంత్రి ఆదేశించారు. మొదటి విడత ఉచిత గ్యాస్ సిలిండర్ సొమ్ము 284 మంది లబ్ధిదారులకుగాను 103 మంది ఖాతాల్లోనే జమైందని గ్రామస్తులు తెలపగా మంత్రి మనోహర్ సంబంధిత అధికారులపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. మళ్లీ ఇటువంటి సమస్యలు పునరావృతమైతే చర్యలకు వెనుకాడబోనని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎపి ట్రైకార్ చైర్మన్ బోరగం శ్రీనివాసులు, ఉంగుటూరు ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు, ఐటిడిఎ పిఒ రాములు నాయక్, డిడిఎంహెచ్‌ఒ సురేష్ తదితరులు పాల్గొన్నారు.