- జిల్లా ఆవిర్భావ దినోత్సవంలో మంత్రి వీరాంజనేయ స్వామి
ప్రజాశక్తి-ఒంగోలు కలెక్టరేట్ : భిన్న పరిస్థితులు ఉన్న ప్రకాశం జిల్లాను అన్ని విధాలుగా అభివృద్ధి చేయడంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి చెప్పారు. ప్రకాశం జిల్లా 56వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని కలెక్టరేట్ ఆవరణం ప్రకాశం భవనంలో ఆదివారం జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. జిల్లాలో బాల్యవివాహాలు, శిశు మరణాలను తగ్గించేందుకు కృషి జరుగుతోందన్నారు. విస్తారంగా ఉన్న భూములను వినియోగంలోకి తెస్తామన్నారు. కనిగిరి ప్రాంతంలో పునరుత్పాదక ఇంధన పరిశ్రమ, గిద్దలూరులో లెదర్ పార్కు ఇందులో భాగమని తెలిపారు. రామాయపట్నం పోర్టు, హార్టికల్చర్ యూనివర్సిటీ ఉన్న కందుకూరు నియోజకవర్గం కూడా త్వరలోనే ప్రకాశం జిల్లాలో విలీనం అవుతుందన్నారు. పొగాకు అనుబంధ పరిశ్రమలు కూడా జిల్లాలో ఏర్పడే అవకాశం ఉందన్నారు. ఈ దిశగా దావోస్ పర్యటనలో సిఎం చంద్రబాబు చర్చలు జరిపినట్లు తెలిపారు. వెలిగొండ ప్రాజెక్టును త్వరగా పూర్తి చేయడంతో పాటు నీటి వనరులను సమర్ధంగా వినియోగించుకునేలా జిల్లాలో అవసరమైన చోట చెక్ డ్యాముల నిర్మాణాన్ని కూడా పరిశీలిస్తున్నట్లు చెప్పారు. తొలుత కలెక్టరేట్ ఆవరణంలో ఉన్న ప్రకాశం పంతులు విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో నిర్వహించిన చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.