- రాతపూర్వకంగా ఇవ్వలేదు శ్రీ హైకోర్టుకు తెలిపిన కేంద్రం
- కోర్టులు జోక్యం చేసుకోవడానికి వీల్లేదని వాదన
ప్రజాశక్తి – అమరావతి : ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇస్తామని రాతపూర్వక హామీ ఇవ్వలేదని, అందువల్ల కోర్టులు జోక్యం చేసుకోవడానికి వీలు లేదని కేంద్ర ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది.
పార్లమెంట్‌లో ఇచ్చిన హామీకి అనుగుణంగా రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చేలా కేంద్రానికి ఆదేశాలు ఇవ్వాలంటూ ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ పిల్ దాఖలు చేసిన పిటిషన్‌పై బుధవారం హైకోర్టులో విచారణ జరిగింది. ప్రత్యేకహోదాపై మౌఖికంగానే హామీ ఇచ్చామని, రాతపూర్వకంగా లేనప్పుడు కోర్టులు ఎలా జోక్యం చేసుకుంటాయని కేంద్ర ప్రభుత్వం తరపున డిప్యూటీ సొలిసిటర్ జనరల్ పసల పాన్నారావు ప్రశ్నించారు. పార్లమెంట్ హామీలపై కోర్టులు విచారణ చేయడానికి వీల్లేదన్నారు. దీంతో జస్టిస్ గుహనాథన్ నరేందర్, జస్టిస్ తూట చంద్ర ధనశేఖర్ డివిజన్ బెంచ్ రాతపూర్వకంగా హామీ లేనప్పుడు తాము ఎలా జోక్యం చేసుకుంటామని పిటిషనర్‌ను ప్రశ్నించింది. ప్రత్యేక హోదా అంశం రెండు ప్రభుత్వాల పరిధిలోని విషయమని చెప్పింది. ప్రభుత్వాలు ఏం చేయాలో కోర్టులు చెప్పలేవని తెలిపింది. ప్రత్యేక హోదా ఇవ్వకపోతే ఎవరు నష్టపోతారో చెప్పాలని పిటిషనర్‌ను ప్రశ్నించింది.
దీనిపై అఫిడవిట్ వేయాలని ఆదేశించింది. విచారణను డిసెంబర్ 11కి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. ప్రత్యేక హోదా లేకపోవడంతో ఏపీ అప్పుల్లో కూరుకుపోయిందని పాల్ చెప్పారు. దీనిపై హైకోర్టు స్పందిస్తూ అప్పులు చేయని రాష్ట్రం ఎక్కడ ఉందో చెప్పాలని ప్రశ్నించింది.