- కర్నూలు, నంద్యాల కలెక్టరేట్ల ముట్టడి
- బకాయిలను వెంటనే విడుదల చేయాలి : ప్రసన్నకుమార్
ప్రజాశక్తి-కర్నూలు కలెక్టరేట్ : కర్నూలు కెవిఆర్ జూనియర్ కళాశాలకు హాస్టల్ సౌకర్యం కల్పించాలని, పెండింగులో ఉన్న విద్యా, వసతి దీవెన బకాయిలు విడుదల చేయాలని, విద్యారంగంలో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో కర్నూలు, నంద్యాల కలెక్టరేట్లను విద్యార్ధులు ముట్టడించారు. కర్నూలు కలెక్టరేట్ లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు నిలువరించారు. దీంతో పోలీసులకు ఎస్‌ఎఫ్‌ఐ నాయకులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. డిఆర్‌ఒకు పోలీసులు సమాచారమివ్వడంతో ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు నుంచి ఆమె వినతిపత్రాన్ని తీసుకున్నారు. సమస్యలన్నింటినీ కలెక్టర్‌కు, ఉన్నతాధికారులకు నివేదిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షులు ప్రసన్న కుమార్, కర్నూలు జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రంగప్ప, అబ్దుల్లా మాట్లాడుతూ.. విద్యార్థులకు సంబంధించిన ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల విడుదలకు సంబంధించి మంత్రి నారా లోకేష్ ట్వీట్ చేశారని, ఆ నిధులు ఎక్కడ విడుదల చేశారని ప్రశ్నించారు. తాము అధికారంలోకి వస్తే విద్యారంగంలో నెలకొన్న సమస్యలు పరిష్కరిస్తామని యువగళం పాదయాత్రలో నారా లోకేష్ హామీ ఇచ్చారని, అధికారంలోకి వచ్చి ఐదు నెలలు అవుతున్న పెండింగులో ఉన్న రూ. 3,480 కోట్ల విద్యాదీవెన, వసతి దీవెన బకాయిలు విడుదల చేయలేదన్నారు. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు అప్పు తెచ్చి ఫీజులు కట్టాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. సంక్షేమ హాస్టళ్లకు సొంత భవనాలు కేటాయించాలని, పెరిగిన ధరలకు అనుగుణంగా మెస్ చార్జీలు రూ.మూడు వేలకు పెంచాలని, తుగ్గలి దేవనకొండ మండల కేంద్రాల్లో ఎపి మోడల్ స్కూల్స్ ఏర్పాటు చేయాలని, తల్లికి వందనం కింద ఇస్తామన్న రూ.15వేలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. నంద్యాలలో నూనెపల్లి ఫ్లైఓవర్ బ్రిడ్జి నుండి కలెక్టరేట్ వరకు విద్యార్థులు నిరసన ర్యాలీ చేపట్టారు. అనంతరం కలెక్టరేట్‌ను ముట్టడించి ఆందోళన చేపట్టారు. డిఆర్‌ఒకు ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు రాజు, ఎంఆర్‌నాయక్ వినతిపత్రం అందజేశారు.