అమరావతి : నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం శుక్రవారం రాత్రికి తుపానుగా మారనుందని అమరావతి వాతావరణ కేంద్రం ప్రకటించింది. గంటకు 8 కిలోమీటర్ల వేగంతో ఉత్తర వాయవ్య దిశగా కదులుతూ శుక్రవారం అదే ప్రాంతంలో కేంద్రీకృతమై ఉందని పేర్కొంది. తుపాను ప్రభావంతో ఎపిలో 3 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. నెల్లూరు, చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురవవచ్చని హెచ్చరించింది. శనివారం మధ్యాహ్నం తమిళనాడులోని కారైకాల్ వద్ద తుపాను తీరం దాటుతుందని తెలిపింది.
శ్రీలంకలోని ట్రింకోమలీకి ఉత్తర ఈశాన్యదిశగా 270 కి.మీ, నాగపట్నానికి తూర్పుగా 300కి.మీ, పుదుచ్చేరికి తూర్పు ఆగేయంగా 340కి.మీ, చెన్నైకి ఆగేయంగా 380 కిలోమీటర్ల దూరంలో ఉందని తెలిపింది. వాయువ్య దిశగా కదిలి.. బలపడి రానున్న 6 గంటల్లో తుపానుగా మారే అవకాశం ఉందని పేర్కొంది. నవంబర్ 30న కారైకాల్ – మహాబలిపురం మధ్య తీరం దాటే అవకాశముందని తెలిపింది. తుపాను తీరం దాటే సమయంలో గంటకు 90 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉందని పేర్కొంది. మత్స్యకారులను వేటకు వెళ్లవద్దని హెచ్చరించింది.