12లోగా కలెక్టర్‌కు నివేదిక
ప్రజాశక్తి – భీమునిపట్నం (విశాఖ) : సిఆర్‌జెడ్ నిబంధనలకు విరుద్ధంగా స్థానిక బీచ్ రోడ్డులో ఆక్రమణలు జరిగాయని, సంబంధిత వివరాలను న్యాయస్థానానికి తెలియజేయాలని హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చిన నేపథ్యంలో కలెక్టర్, జివిఎంసి ఇన్‌ఛార్జి కమిషనర్ ఎంఎన్.హరేంధిర ప్రసాద్ ఆదేశాల మేరకు జివిఎంసి, కాలుష్య నియంత్రణ మండలి, సిఆర్‌జెడ్ అధికారులు రెండో రోజైన ఆదివారమూ పలు ప్రాంతాల్లో సర్వే జరిపారు. పరిశీలన పూర్తయ్యాక సంబంధిత నివేదికను బుధవారం నాటికి హైకోర్టుకు వారు సమర్పించాల్సి ఉంది. హైకోర్టు ఉత్తర్వుల మేరకు గతంలో వైసిపి మాజీ ఎంపీ విజయ సాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డి అక్రమించినట్టుగా చెప్పబడుతున్న స్థలంలో ఇప్పటికే ప్రహరీని జివిఎంసి అధికారులు పాక్షికంగా కూల్చివేశారు. అదే ప్రాంతంతో పాటు తీరం వెంబడి వెలసిన ఎస్‌ఒఎస్ కూడలి వద్ద శ్మశాన వాటికకు ఆనుకుని నిర్మించిన ఓ రెస్టారెంట్, కొబ్బరి తోట పార్కు, పక్కనే ఉన్న తీరం రిసార్ట్, పలు రెస్టోబార్ ప్రాంతాల్లో బృందం సర్వే చేపట్టింది. సిఅర్‌జెడ్ నిబంధనలు ఉల్లంఘించి జరిపిన ఆక్రమణలపై తుది నివేదికను ఈ నెల 12లోగా కలెక్టర్‌కు ఇవ్వనున్నట్టు అధికారులు చెబుతున్నారు. జివిఎంసి అదనపు కమిషనర్ ఎస్‌ఎస్.వర్మ, పట్టణ ప్రణాళిక విభాగం అధికారి కె.హరిదాసు, మండల తహశీల్దార్ పైలా రామారావు, జివిఎంసి ఒకటో జోన్ అసిస్టెంట్ సిటీ ప్లానర్ రామకృష్ణ తదితరులు తాజా సర్వేలో పాల్గొన్నారు.
