కర్నూలులో దారుణం.. టిడిపి కార్యకర్త హత్య

Jun 9,2024 23:39 #Kurnool, #mudder, #Tdp Leader

ప్రజాశక్తి-వెల్దుర్తి (కర్నూలు) : కర్నూలు జిల్లాలో దారుణం జరిగింది. టిడిపి కార్యకర్తను వైసిపి నేతలు వేటకొడవళ్లతో నరికి హత్య చేశారు. ఈ సంఘటన వెల్దుర్తి మండలం బొమ్మిరెడ్డిపల్లె గ్రామంలో ఆదివారం సాయంత్రం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బొమ్మిరెడ్డిపల్లె గ్రామంలో పోలింగు రోజున వైసిపి, టిడిపి నాయకుల మధ్య చిన్నపాటి ఘర్షణ చోటుచేసుకుంది. వైసిపి కార్యకర్తలను టిడిపి నాయకులు కొట్టారు. ఈలోపు పోలీసులు వచ్చి చెదరగొట్టడంతో వివాదం సర్ధుమణిగింది. ఆదివారం సాయంత్రం టిడిపి కార్యకర్త గిరి (35) తన సోదరునితో కలిసి వైసిపి నాయకుడు రమేష్‌ ఇంటివైపు వెళ్లారు. ఇటువైపు ఎందుకు వచ్చావంటూ గిరిని రమేష్‌ నిలదీయడంతో మాటామాటా పెరిగింది. ఈ క్రమంలో రమేష్‌ తన అనుచరులతో కలిసి గిరి, ఆయన సోదరునిపై వేటకొడవళ్లతో దాడి చేశారు. గిరికి బలమైన గాయాలయ్యాయి. ఆయన సోదరుడు స్వల్ప గాయాలతో తప్పించుకున్నారు. తీవ్రంగా గాయపడిన గిరిని కుటుంబ సభ్యులు వెల్దుర్తి ప్రభుత్వ వైద్యశాలకు తీసుకెళ్లారు. వైద్యులు పరీక్షించి మృతి చెందినట్లు తెలిపారు. సిఐ సురేష్‌ కుమార్‌ రెడ్డి, ఎస్‌ఐ పి.చంద్రశేఖర్‌ రెడ్డి బొమ్మిరెడ్డిపల్లి గ్రామానికి చేరుకుని సంఘటన స్థలాన్ని పరిశీలించారు. హత్యకు పాల్పడిన వారి వివరాలు తెలుసుకొని కేసు నమోదు చేశారు. ఎస్‌పి జి.కృష్ణకాంత్‌ గ్రామాన్ని సందర్శించారు. గ్రామంలో ఎలాంటి ఉద్రిక్తతలు తావివ్వకుండా పోలీస్‌ పికెట్‌ ఏర్పాటు చేశారు.

➡️