ప్రజాశక్తి – పోలవరం : పోలవరం ప్రాజెక్టును విదేశీ నిపుణుల బృందం శనివారం పరిశీలించింది. ఈ బృందంలో అమెరికాకు చెందిన అంతర్జాతీయ నిపుణులు డియాన్ ఫ్రాన్క్కోడి కికో, డేవిడ్ పాల్ ఉన్నారు. మధ్యాహ్నం 12.30 గంటలకు రాజమహేంద్రవరం ఎయిర్‌పోర్టుకు చేరుకున్న బృందం ప్రత్యేక వాహనాల్లో పోలవరం ప్రాజెక్టు కార్యాలయానికి చేరుకున్నారు. బోజన విరామానంతరం పోలవరం ప్రాజెక్టు డయాఫ్రంవాల్ నిర్మాణ ప్రాంతానికి చేరుకుని అక్కడ డయాఫ్రంవాల్ ప్లాస్టిక్ కాంక్రీటు పనులు, డయాఫ్రంవాల్ ట్రెంచ్ కట్టింగ్ పనులు, బెంటోనైట్ మిక్సింగ్ ట్యాంకుల వద్ద డిశాండింగ్ పనులు పరిశీలించారు. అనంతరం బెంటోనైట్ మిక్సింగ్, ప్లాస్టిక్ కాంక్రీటు మిక్సింగ్ జరుగుతున్న బ్లాచింగ్ ప్లాంటులను పరిశీలించారు. ప్లాస్టిక్ కాంక్రీటు పనుల తీరు, డిశాండింగ్‌లో వస్తున్న మట్టి రాతి నమూనాలను డయాఫ్రంవాల్ ప్రాంతంలో ఉన్న ల్యాబ్‌లో పరిశీలించారు. ఆ ప్రాంతంలో అధికారులు ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను పరిశీలించారు. సంబంధిత వివరాలను సిఇ నరసింహమూర్తి, ఎస్‌ఇ రామచంద్రరావు బావర్ కంపెనీ ప్రతినిధి హసన్ మెగా కంపెనీ ప్రతినిధి అంగర సతీష్‌ను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ప్రాజెక్టు అతిథి గృహంలో పోలవరం ప్రాజెక్టు అథారిటీ అధికారులు, ఇంజినీరింగ్ అధికారులతో గంటసేపు సమావేశం నిర్వహించారు. అనంతరం రాజమహేంద్రవరం తరలివెళ్లారు. ఈ బృందం ఆదివారం కూడా పోలవరం ప్రాజెక్టు పరిశీలన కార్యక్రమంలో పాల్గొననున్నట్లు ఇంజినీరింగు అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రాజెక్టు అథారిటీ చీఫ్ ఇంజినీర్ రాజేష్ కుమార్, ఇఇలు సుధాకర్, వెంకటరమణ, తదితరులు పాల్గొన్నారు.
