పవన్‌ ప్రచారానికి తాత్కాలిక విరామం

Apr 1,2024 08:08
  • అర్ధాంతరంగా హైదరాబాద్‌కు పయనమైన నేత
  • అనారోగ్య కారణాలే కారణమంటున్న పార్టీ శ్రేణులు

ప్రజాశక్తి-కాకినాడ ప్రతినిధి : కాకినాడ జిల్లా పిఠాపురంలో ఎన్నికల ప్రచారానికి జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ తాత్కాలిక విరామం ఇచ్చారు. ఆదివారం సాయంత్రం ఆయన అర్ధాంతరంగా ప్రత్యేక హెలికాప్టర్‌లో హైదరాబాద్‌కు పయనమయ్యారు. స్వల్ప అనారోగ్య సమస్యలతో ఆయన బాధపడుతున్నట్టు సమాచారం. ఈ కారణంగానే ఆయన హైదరాబాద్‌కు వెళ్లిపోయారని పార్టీ శ్రేణులు తెలిపాయి. సోమవారం సాయంత్రం ఆయన పిఠాపురం చేసుకుంటారని సమాచారం. అయితే, తాత్కాలిక విరామంపై అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. రెండో రోజు ప్రచారంలో భాగంగా పిఠాపురంలో పలు ఆలయాలను ఆయన సందర్శించారు. పాదగయలో ప్రత్యేక పూజలు నిర్వహించి, పట్టు వస్త్రాలు సమర్పించారు. ఆలయ మర్యాదలతో అర్చకులు స్వాగతం పలికారు. కుక్కుటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ప్రముఖ దత్త క్షేత్రంగా పేరున్న దత్తపీఠానికి వెళ్లారు. అక్కడ శ్రీపాద వల్లభున్ని దర్శించుకున్నారు. ఆయన వెంట కాకినాడ లోక్‌సభ జనసేన పార్టీ అభ్యర్ధి తంగెళ్ల ఉదరు శ్రీనివాస్‌, పార్టీ నేతలు ఉన్నారు.

షరతులు.. సంఘర్షణలు
మూడు పార్టీలు సమన్వయంతో, పొత్తులతో ఎన్నికలను ఎదుర్కొవాలంటే సీట్ల కేటాయింపుల్లో ఎన్నో షరతులు, ఎన్నో అలకలు, మరెన్నో సంఘర్షణలు ఉంటాయని, వైసిపి పాలన నుంచి రాష్ట్రాన్ని బయటపడేయాలనే లక్ష్యంతో పొత్తులకు ఎలాంటి షరతులు పెట్టకుండానే ముందుకు వెళ్లామని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అన్నారు. పిఠాపురంలో కూటమి నేతల ఆత్మీయ సమన్వయ సమావేశం ఆదివారం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వచ్చేది కూటమి ప్రభుత్వమేనని, భారీ మెజార్టీతో ఎక్కువ సీట్లు గెలవబోతున్నామని జోస్యం చెప్పారు. సమావేశంలో పిఠాపురం నియోజకవర్గం టిడిపి ఇన్‌ఛార్జ్‌ ఎస్విఎస్‌ఎన్‌.వర్మ, నియోజకవర్గం బిజెపి ఇన్‌ఛార్జ్‌ బి.కష్ణంరాజు, జనసేన ఎంపి అభ్యర్థి ఉదరు శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

➡️