క్షమించు తల్లీ …!

  • తిరుపతిలో మంటగలిసిన మానవత్వం
  • మూడేళ్ల చిన్నారిని కబళించిన మగోన్మాదం

ప్రజాశక్తి – పుత్తూరు టౌన్‌ (తిరుపతి జిల్లా) : తెల్లనివన్నీ పాలు కావని ఆ చిన్నారికి ఏం తెలుసు ? మురిపించే మాటల వెనుక మాటేసిన తోడేళ్లుంటాయని అర్థం చేసుకునే వయసు అసలే కాదు! మబ్బు పడితే… చినుకు రాలితే తన కోసమేనని మైమరిచిపోయే అభం.. శుభం తెలియని పసితనం! రోజూ ఆడుకునే మామే కదా అనుకుంది! కన్ను మిన్నూ కానని మగోన్మాదం కాటేస్తుందని ఆ మూడేళ్ల అమాయకత్వానికి ఎలా తెలుస్తుంది? ఇప్పుడేమనుకుని ఏం లాభం! రాష్ట్రంలో పెచ్చుమీరుతున్న పైశాచిక సంస్కృతికి మరో చిన్నారి బలైపోయింది. పోలీసులు.. చట్టాలు.. శిక్షలు, కన్నీటి రోదనలు… పరిహార ప్రకటనలు ఏవైనా, ఎన్నైనా తెగిపోయిన జీవితాన్ని మళ్లీ అతికించగలవా? ‘గుండెలు పగిలేలా రోదిస్తున్న ఆ తల్లిదండ్రులకు ఊరటనియ్యగలవా? ‘ ఈ దుస్థితికి కారణమెవరని’… మట్టిపొరలను చీల్చుకుని ఆ చిన్నారి నిలదీస్తే ఏం జవాబుచెబుతాం? ‘క్షమించు తల్లీ…’ అన్న మాట తప్ప!

అడ్డూ, అదుపు లేకుండా రాష్ట్రంలో సాగుతున్న అమానుష కాండ కొనసాగింపునకు ఈసారి తిరుపతి జిల్లా వేదికైంది. ఆ జిల్లాలోని వడమాలపేట మండలం ఎఎంపురం (అబ్బికండ్రిగ) పంచాయతీ యానాది కాలనీలో ఈ ఘోరం చోటుచేసుకుంది. ఇంటి దగ్గర ఆడుకుంటున్న మూడు సంవత్సరాల చిన్నారిని ‘చాక్లెట్‌ కొనిస్తా…’ అంటూ తీసుకెళ్లి అత్యాచారం చేసి, ఉపిరి తీసిన దారుణ సంఘటన ఇది! రోజూ ఆ చిన్నారితో ఆడుకునే సమీప బంధువే ఈ ఘోరానికి పాల్పడ్డాడని తేలడంతో స్థానికులు దిగ్భ్రాంతికి గురయ్యారు. బతకడానికి పొట్ట చేతపట్టుకుని వలస వచ్చిన వారిలో మృతి చెందిన చిన్నారి తల్లిదండ్రుల కుటుంబం కూడా ఒకటి! తల్లిదండ్రులు పనులకు వెళ్లినప్పుడు ఇరుగు, పొరుగు వారు పిల్లలను చూసుకోవడం సహజమే! శుక్రవారం మధ్యాహ్నం పనికోసం బయటకెళ్లిన తల్లిదండ్రులు తమ చిన్నారిని అలాగే ఇంటి దగ్గరే వదిలివెళ్లారు. ఇంత ఘోరం జరుగుతుందని ఏమాత్రం అనుమానమున్నా అలా వదిలివెళ్లే వారు కాదేమో! ఇంటి దగ్గరే ఆడుకుంటున్న ఆ పసిపాపను సుశాంత్‌ అలియాస్‌ నాగరాజు (21) అనే యువకుడు ‘చాక్లెట్‌ కొనిస్తా’ అంటూ తనతో తీసుకెళ్ళాడు. సమీప బంధువే కావడం, ఇరుగు పొరుగు వారికి కూడా బాగా తెలిసిన వాడే కావడంతో ఎవరికీ అనుమానం రాలేదు. అయితే, చిన్నారి ఎంతకీ ఇంటికి రాకపోవడంతో ఆందోళనకు గురైన తల్లిదండ్రులు వెతుకులాట ప్రారంభించారు. రాత్రంతా గాలించినా ఫలితం కనిపించలేదు. దీంతో భోరుమంటూ పోలీసులను ఆశ్రయించారు. పోలీసుల విచారణలో సుశాంత్‌ ఆ చిన్నారిని తీసుకెళ్లిన విషయం తెలిసింది. ఏమీ తెలియనట్టు ఇంటి వద్ద ఉన్న అతనిని శనివారం ఉదయం అదుపులోకి తీసుకుని ప్రశ్నించడంతో గుండెలు పగిలే ఘోరం వెలుగులోకి వచ్చింది! సమీపంలోని పొదల్లోకి తీసుకువెళ్లి అత్యాచారానికి పాల్పడినట్టు, బాధ భరించలేక ఆ చిన్నారి ఏడుస్తుంటే, అందరికీ చెప్పేస్తుందని భయపడి ప్రాణం కూడా తీసినట్లు సుశాంత్‌ చెప్పినట్లు జిల్లా ఎస్‌పి సుబ్బరాయుడు విలేకరులకు తెలిపారు. ఊపిరి ఆగిందని నిర్ధారించుకున్న తరువాత అక్కడే పూడ్చిపెట్టి ఏమీ తెలియనట్టు ఇంటికి వెళ్లిపోయాడు. పోలీసులు మృతదేహాన్ని వెలికి తీసి పోస్టుమార్టం నిమిత్తం పుత్తూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. నిందితుడు సుశాంత్‌ పోలీసుల అదుపులో ఉన్నాడు. ఎస్‌పి సుబ్బరాయుడు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. తిరుపతి ఆర్డీవో, వడమాలపేట తహశీల్దార్‌ పుత్తూరు ప్రభుత్వాస్పత్రికి వచ్చి మృతదేహాన్ని పరిశీలించారు.

పది లక్షల ఆర్థిక సాయం : సిఎం ప్రకటన

ఈ అమానుష కాండపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విచారం వ్యక్తం చేశారు. చిన్నారి కుటుంబానికి పది లక్షల రూపాయల ఆర్థిక సాయాన్ని ప్రకటించారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఆదివారం మధ్యాహ్నం రాష్ట్ర హోంమంత్రి బాధిత కుటుంబానికి ఈ మొత్తాన్ని అందజేస్తారని అధికారులు తెలిపారు.

పునరావృతం కాకుండా చూడండి : సిపిఎం

ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని, బాధిత కుటుంబానికి రూ.25 లక్షల ఆర్థిక సాయం, ఐదెకరాల పొలం, ఉద్యోగం ఇవ్వాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వందవాసి నాగరాజు డిమాండ్‌ చేశారు.

మహిళలకు రక్షణ లేదు : రోజా

ఆంధ్రాలో మహిళలకు రక్షణ లేదని మాజీ మంత్రి ఆర్‌కె రోజా మండిపడ్డారు. బాధిత కుటుంబాన్ని ఆమె పరామర్శించారు. ప్రభుత్వం స్పందించాలని, నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు.

ప్రజాసంఘాల కొవ్వొత్తుల ప్రదర్శన

అమానుష కాండకు నిరసనగా తిరుపతిలోని పుత్తూరు అంబేద్కర్‌ విగ్రహం వద్ద ఎస్‌ఎఫ్‌ఐ, సిఐటియు, ఐద్వా ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టు ద్వారా నిందితున్ని విచారించి కఠినంగా శిక్షించాలని ఐద్వా జిల్లా కార్యదర్శి పి సాయిలక్ష్మి డిమాండ్‌ చేశారు. బాధిత కుటుంబానికి రూ.25 లక్షలు నష్టపరిహారం చెల్లించాలని, వారి కుటుంబంలో ఇద్దరికి తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉద్యోగాలు ఇప్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు అక్బర్‌, రవి, సిఐటియు నేతలు వెంకటేష్‌, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా నాయకులు వినోద్‌, నరేంద్ర, హర్షద్‌, గణేష్‌ పాల్గొన్నారు.

➡️