డోలీలోనే గిరిజన మహిళ ప్రసవం..  తల్లీబిడ్డ క్షేమం

May 17,2024 08:14 #birth in doli, #tribal woman

ప్రజాశక్తి-శృంగవరపుకోట (విజయనగరం) : పురిటినొప్పులతో బాధపడుతున్న ఓ గిరిజన మహిళను డోలీలో ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో ప్రసవించిన ఘటన విజయనగరం శృంగవరపుకోట పంచాయతీ రేగ పుణ్యగిరిలో గురువారం చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు.. రేగ పుణ్యగిరికి చెందిన వంతల సుబ్బారావు భార్య వంతల కుషాయికి నెలలు నిండడంతో గురువారం పురిటి నొప్పులు మొదలయ్యాయి. సుబ్బారావు, కుటుంబ సభ్యులు డోలీ మోతతో ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలోనే ఆమె మగ బిడ్డను ప్రసవించింది. తల్లీ బిడ్డను స్థానిక ఏరియా ఆస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతానికి ఇద్దరు క్షేమంగానే ఉన్నారని, ఆమెకు ఇది ఐదవ సంతామనమని సుబ్బారావు తెలిపారు. ఈ నేపథ్యంలో ఆదివాసి గిరిజన సంఘం నాయకుడు జరత గౌరీష్‌, సిపిఎం నాయకుడు మద్దిల రమణ మాట్లాడుతూ.. గిరిజన గ్రామాలను 5వ షెడ్యూల్లో చేర్చి ఉంటే ఈ డోలీ దుస్థితి ఉండేది కాదని, కావాలనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గిరిజన ప్రాంతాలను అభివృద్ధి చేయట్లేదని అన్నారు. గిరిజన ప్రాంతాలన్నింటినీ ఐటిడిఎ పరిధిలో చేర్చి అభివృద్ధి చేయాలని డిమాండ్‌ చేశారు.

➡️