ప్రేమను అంగీకరించలేదని యువతిపై దాడి

ప్రజాశక్తి -గాజువాక (విశాఖపట్నం) : ప్రేమను అంగీకరించలేదని యువతిపై దాడి చేసిన సంఘటన విశాఖ జిల్లా పెదగంట్యాడ మండలం న్యూ పోర్టు పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం… బాల చెరువు గ్రామంలో నివాసముంటున్న యువతి (21) సైకాలజీ విభాగంలో బిఎస్‌సి పూర్తి చేశారు. ఎనిమిది నెలల క్రితం ‘ఓం శాంతి’ టూర్‌లో భాగంగా తల్లితో కలిసి జమ్మూ కశ్మీర్‌కు వెళ్లారు. అక్కడ ఓ భక్తురాలితో వీరికి పరిచయం ఏర్పడింది. ఆశ్రమంలో ఉండగా ఆ భక్తురాలి కుమారుడు నీరజ్‌శర్మ వీరికి పరిచయమయ్యారు. దీంతో ఫోన్‌ నెంబర్లు చెప్పుకున్నారు. టూర్‌ అయిపోయిన తర్వాత మేఘన, ఆమె తల్లి ఇంటికి వచ్చేశారు. పెదగంట్యాడ బిసి రోడ్డులోని ఓంశాంతి ఆశ్రమంలో జరిగిన ఓ కార్యక్రమానికి జమ్మూకశ్మీర్‌ నుంచి నీరజ్‌శర్మ, ఆమె తల్లి వచ్చారు. ఆ సమయంలో యువతి ఇంటికి వెళ్లారు. ఆరు నెలల క్రితం ఆ యువతికి నీరజ్‌ శర్మ ప్రేమ ప్రతిపాదన పెట్టడంతో ఆమె నిరాకరించారు. ప్రేమించకపోతే ఫొటోను మార్ఫింగ్‌ చేసి సోషల్‌ మీడియాలో పెడతానని బెదిరించాడు. దీనిపై మేఘన తండ్రి పాపారావు స్థానిక పోలీసులకు రెండుసార్లు ఫిర్యాదు చేశారు. సైబర్‌ క్రైమ్‌లో కూడా ఫిర్యాదు చేశారు. గురువారంనాడు యువతి ఇంటికి నీరజ్‌శర్మ వచ్చాడు. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ఆమె తలపై రాడ్డుతో బలంగా కొట్టడంతో తీవ్ర గాయమైంది. అనంతరం నిందితుడు పరారయ్యాడు. స్థానికులు ఆమెను షీలానగర్‌ కిమ్స్‌ ఐకాన్‌ ఆస్పత్రికి తరలించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఎసిపి కాళిదాసు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించి కేసు నమోదు చేశారు. అన్ని పోలీస్‌ స్టేషన్లకు, టోల్‌గేట్లకు నిందితుడి ఫొటో పంపించి అలెర్ట్‌ చేశారు.

➡️