‘రెడ్‌బుక్‌’తో అధికార దుర్వినియోగం

Feb 14,2025 23:09 #red book, #ys jagan

మాజీ సిఎం వైఎస్‌ జగన్‌
ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : రాష్ట్రంలో చట్టానికి, న్యాయానికి చోటులేకుండా పోయిందని, తీవ్ర అధికార దుర్వినియోగంతో రెడ్‌బుక్‌ రాజ్యాంగాన్ని అమలుచేస్తూ అక్రమ అరెస్టులకు పాల్పడుతున్నారని మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. దీనిపై శుక్రవారం ఎక్స్‌లో పోస్టు చేశారు. రాజ్యాంగానికి పాలకులు తూట్లు పొడుస్తున్నారని, వంశీ విషయంలో కూటమి సర్కారు తీరు అన్యాయంగా ఉందని తెలిపారు. ఈ కేసులో తనతో టిడిపి నాయకులు బలవంతంగా కేసు పెట్టించారని జడ్జి ముందు దళిత యువకుడు వాంగ్మూలం ఇస్తే దాన్ని తట్టుకోలేక దుర్మార్గాలకు దిగుతున్నారని పేర్కొన్నారు. నిజాన్ని చెప్పినందుకు పోలీసులను పంపించి మరీ వేధిస్తున్నారని, కక్షలు తీర్చుకోవడానికి ప్రభుత్వ వ్యవస్థలను ఇన్ని రకాలుగా దుర్వినియోగం చేస్తారా? అని ఆయన ప్రశ్నించారు. సుప్రీంకోర్టు దృష్టిలో ఉన్న కేసు విచారణలో ఉండగానే వంశీని అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. దెందులూరులో మాజీ ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్య చౌదరిపై కేసు పెట్టడాన్ని ఖండించారు. అబ్బయ్యచౌదరి కారు డ్రైవర్‌ను స్థానిక ఎమ్మెల్యే బెదిరించి బూతులు తిట్టి పైగా వారిపైనే కేసులు పెట్టించారని పేర్కొన్నారు. తప్పుడు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరిన వారిపైనే హత్యాయత్నం కేసులు పెడుతున్నారని వివరించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. ప్రజలకు ఇచ్చిన సూపర్‌ సిక్స్‌తోపాటు 143 హామీలు నిలబెట్టుకోలేక, ఒక్కదాన్నీ అమలు చేయక ప్రజల దృష్టిని మళ్లించేందుకు వైసిపి నాయకులను, కార్యకర్తలను లక్ష్యంగా చేసుకుని వేధిస్తున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వ తప్పులను ప్రజలు వారి డైరీల్లో రాసుకుంటున్నారని, తగిన మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు.

➡️